Bihar Firing Incident : ఛఠ్ పూజ వేళ.. బిహార్లోని లఖీసరాయ్లో కాల్పులు కలకలం రేపాయి. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కబయ్యా పోలీస్ స్టేషన్ పరిధిలోని పంజాబీ మొహల్లా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రేమ వ్యవహరమే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులంతా ఛఠ్ పూజలో భాగంగా సూర్యుడికి అర్ఝ్యం అర్పించి వస్తుండగా వారి పొరిగింటి యువకుడు కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన నలుగురిని మెరుగైన వైద్యం కోసం పట్నా ఆస్పత్రిలో చేర్పించారు. మరణించిన వారి మృతదేహాలను శవపరీక్షల కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ వ్యవహరమే ఈ ఘటనకు కారణమని లఖీసరాయ్ ఎస్పీ పంకజ్ కుమార్ తెలిపారు.
'పొరిగింటి యువకుడే..'
"ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు.. ఛఠ్ పూజ నిర్వహించి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో వారి పొరిగింటి యువకుడు ఆశిష్.. వెనుక నుంచి కాల్పులు జరిపాడు. బాధిత కుటుంబానికి చెందిన యువతిని నిందితుడు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అందుకు వారు నిరాకరించారు. దీంతో ఆశిష్ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దర్యాప్తు ప్రారంభించాం. నిందితుడిని అరెస్ట్ చేస్తాం" అని ఎస్పీ పంకజ్ కుమార్ తెలిపారు.
ఛఠ్ ఘాట్ వద్ద సిలిండర్ పేలుడు.. 10మందికి గాయాలు
బిహార్.. పశ్చిమ చంపారన్ జిల్లాలో బెట్టియాలో ఛఠ్ ఘాట్ వద్ద సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మందికిపైగా గాయపడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
బాణసంచా వివాదం.. ముగ్గురికి గాయాలు
మరోవైపు, బిహార్లోని వైశాలిలో బాణసంచా పేల్చడంపై చెలరేగిన వివాదం.. రెండు వర్గాల మధ్య కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. గాయపడిన వారిని పట్నా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.