అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు.. విదేశంలో ఉద్యోగం చేస్తున్నాడని ఆనందపడిన తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ఎన్నో ఆశలతో ఉపాధి కోసం వెళ్లిన 23 ఏళ్ల బిడ్డను గుండెపోటు కబళించింది. స్వదేశానికి మృతదేహం వచ్చిందని తెలిసిన కుటుంబసభ్యులు లాక్డౌన్ సమయంలోనూ ఇబ్బందులుపడి విమానాశ్రయానికి వెళ్తే.. ఆ ప్రయత్నాన్ని అధికారులు నీరుగార్చారు. కడసారి కొడుకును చూడాలనుకుంటోన్న తల్లిదండ్రులకు మరింత వేదన మిగిల్చారు. మృతదేహాన్ని అందుకోలేక, అతడికి అంత్యక్రియలు చేయలేక వారు ఈటీవీ భారత్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏమైంది...?
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్‌కు చెందిన కమలేశ్ భట్.. అబుదబికి ఉపాధి నిమిత్తం వెళ్లాడు. అక్కడే ఓ సంస్థలో పనిచేస్తున్న అతడు.. ఏప్రిల్ 17న గుండెపోటుతో మరణించాడు. విషయం తెలిసిన తర్వాత ఓ వ్యక్తి సాయంతో స్వదేశానికి రప్పించిన ఆ మృతదేహన్ని.. లాక్డౌన్ నిబంధనలు అనుమతించవని గంటల వ్యవధిలో అబుదబికే తిప్పి పంపేశారు భారత అధికారులు. వారి తీరుపై మృతుడి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
" ఏప్రిల్ 23న ఎతిహాద్ విమానంలో కమలేశ్ మృతదేహం స్వదేశానికి వచ్చింది. భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు దాన్ని తీసుకోడానికి నిరాకరించారు. మేము ఆ మృతదేహన్ని తీసుకొనేందుకు ఇబ్బందులు పడుతూ విమానాశ్రయానికి వెళ్లగా.. కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన లాక్డౌన్ నిబంధనల ప్రకారం ఎలాంటి ప్యాకేజీ స్వీకరించేందుకు తమకు అనుమతి లేదని కార్గో సిబ్బంది తెలిపారు. ఎంత అడిగినా శవాన్ని దించకుండానే తిరిగి పంపేశారు. ఇది రెండు దేశాల అధికారుల మధ్య సమన్వయ లోపాన్ని తెలియజేస్తోంది. భారత విదేశాంగ శాఖ చొరవ తీసుకుంటే ఆ మృతదేహం మాకు చేరేది."
-- విమలేశ్ భట్, కమలేశ్ బంధువు
గంటల వ్యవధిలోనే భారత్‌కు వచ్చిన శవపేటికను.. అందుకొనే లోపే తిప్పి పంపడంపై కన్నీరు మున్నీరయ్యారు కుటుంబసభ్యులు. ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న బాధితుడి తల్లిదండ్రులు కన్నబిడ్డ ఆఖరిచూపు కోసం ఎదురుచూస్తుంటే వారికి ఏమని చెప్పాలి? అంటూ ఈటీవీ భారత్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
స్వదేశానికి తెచ్చేందుకు చాలా కష్టపడ్డాం..
కమలేశ్ చనిపోయిన విషయం తెలియగానే అక్కడ ఉన్న మన విదేశాంగ శాఖ.. బాధితుడి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందిచలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు.
" కమలేశ్ చనిపోయిన విషయాన్ని భారత విదేశాంగ శాఖ తల్లిదండ్రులకు తెలియపరచలేదు. ఓ సామాజిక కార్యకర్త ద్వారా విషయం తెలిసింది. అతడి సాయంతోనే శవ పరీక్షలు చేయించి నాన్ అబ్జక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాం. మృతదేహన్ని స్వదేశానికి తెచ్చేందుకు సొంత డబ్బులతో ఏర్పాట్లు చేసుకున్నాం. తీరా ఇక్కడకు వచ్చేసరికి అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరించారు."
-- విమలేశ్ భట్, కమలేశ్ బంధువు
ఈటీవీభారత్ తోడ్పాటు..
ఈ విషయంపై హోంశాఖ, విదేశీ వ్యవహారాల అధికారులను ఈటీవీ భారత్ సంప్రదించింది. కమలేశ్ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అందించడంలో వైఫల్యానికి సమధానమివ్వాలని కోరింది. అబుదబిలోని భారత ఎంబసీ సరైన సహకారం అందించకపోవడాన్ని ప్రశ్నించింది. హోంశాఖ దృష్టికి సమస్యను తీసుకెళ్లింది.