ETV Bharat / bharat

నేతన్నల యాతన... వైరస్​ వ్యాప్తితో కష్టాలు! - Weavers India

ప్రపంచాన్ని కబళిస్తోన్న కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు మూతపడ్డాయి. ఫలితంగా చేనేత రంగంపై తీవ్రప్రభావం చూపుతోంది. వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం చేపట్టిన లాక్​డౌన్​ వల్ల దేశవ్యాప్తంగా వస్త్ర ఉత్పత్తికి తీవ్ర విఘాతం ఏర్పడింది. ఇప్పటికే అంతంతమాత్రాన ఉన్న ఈ రంగం మరింత అట్టడుగు స్థాయికి చేరింది. దీంతో చేనేత కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

Weavers are facing more difficulty due to Corona Virus
నేతన్నల యాతన... వైరస్​ వ్యాప్తితో కష్టాలు!
author img

By

Published : Apr 19, 2020, 8:38 AM IST

చేనేత రంగాన్ని కరోనా మహమ్మరి కబళిస్తోంది. వైరస్‌ విస్తరణను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయం వల్ల, నాలుగు వారాలుగా దేశవ్యాప్తంగా వస్త్ర ఉత్పత్తికి విఘాతమేర్పడింది. ఇప్పటికే తీవ్ర ఒడుదొడుకుల్లో ఉన్న ఈ రంగం తాజా పరిణామాల వల్ల పూర్తిగా చతికిలపడింది. రెక్కాడితే గాని డొక్కాడని నేతన్నల బతుకులు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి సహా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, యూపీ, కశ్మీర్‌, పశ్చిమ్‌ బంగ, మహారాష్ట్ర, రాజస్థాన్‌, అసోం, ఒడిశా, తమిళనాడుల్లో వస్త్రరంగం తీవ్రంగా దెబ్బతింది. కార్మికులతో నడిచే చేనేత సంఘాలన్నీ సామాజిక దూరం నిబంధనల దృష్ట్యా మూతపడ్డాయి. దేశమంతటా సామూహిక ఉత్పత్తి నిలిచిపోయింది. వైరస్‌ భయంవల్ల అనేకమంది పనిలోకి వెళ్లడానికే భయపడుతున్నారు. దీంతో పేరొందిన వస్త్ర ఉత్పత్తి కేంద్రాల్లోనూ మగ్గాల చప్పుడు వినిపించడం లేదు. చీరలు, ధోవతులు, దుప్పట్లు, లుంగీల తయారీ నిలిచిపోయింది.

స్తంభించిన రవాణా, విక్రయాలు

చేనేతకు సహకార సంఘాలే పెద్దదిక్కు. కార్మికులకు నూలు అందించి, మగ్గాలను సమకూర్చి, పనులు చేయించి, ఆ వస్త్రాలను ప్రభుత్వ శాఖలకు, ప్రభుత్వరంగ సంస్థలకు విక్రయిస్తుంటాయి. లాక్‌డౌన్‌ కారణంగా సంఘాల కార్యకలాపాలు మొత్తంగా స్తంభించాయి. సరకు విపణికి వెళ్లక వాటిలో నిల్వలు పేరుకుపోయాయి. అసంఘటిత రంగంలోని కార్మికులది మరింత దయనీయ స్థితి. ఇళ్ల వద్ద చీరలు, ఇతర వస్త్రాలను ఉత్పత్తి చేసి మాస్టర్‌ వీవర్లు, వస్త్రవ్యాపారులకు వీరు విక్రయిస్తుంటారు. కొందరు దేశవ్యాప్తంగా జరిగే ప్రదర్శనలకు సరకు తరలిస్తారు. మరికొందరు సంతల్లో విక్రయిస్తారు. ఇప్పుడివన్నీ మూతపడటంతో వ్యాపారులు చేతులెత్తేశారు. వస్త్ర దుకాణాలూ బంద్‌ అయ్యాయి. అంగళ్లు సాగడం లేదు. దీంతో కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలు సైతం ఇళ్లలోనే పేరుకుపోతున్నాయి. దేశంలో ప్రతి నెలా చేనేత రంగం నుంచి వెయ్యి కోట్ల రూపాయల మేర ఉత్పత్తులు జరగాల్సి ఉంటుంది. మార్చి మూడో వారం నుంచి ఇప్పటివరకు చేనేత అమ్మకాలు నిలిచిపోవడంతో ఆదాయం ఏ మాత్రం సమకూరలేదు.

నిలిచిపోయిన భారీ క్రయవిక్రయాలు

తమిళనాడులో కోఆప్టెక్స్‌, తెలంగాణలో టెస్కో, ఏపీలోని ఆప్కో, ఇండీటెక్స్‌ (గుజరాత్‌), కావేరీ (కర్ణాటక), బోయనిక (ఒడిశా), ఉద్యం (రాజస్థాన్‌), తంతూజ (పశ్చిమ్‌ బంగ) వంటి చేనేత వస్త్ర విక్రయశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వరంగ సంస్థలకూ తాళం పడటంతో వస్త్రాలు దుకాణాల్లో ఉండిపోతున్నాయి. చేనేత వస్త్రాల క్రయవిక్రయాలకు ప్రదర్శన శాలలు గొప్ప సాయం అందిస్తుంటాయి. దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తదితర మహానగరాల్లో నిత్యం సాగే ప్రదర్శనల్లో చేనేత సంఘాలు, ప్రభుత్వరంగ సంస్థలు వస్త్రాలను విక్రయిస్తుంటాయి. మార్కెటింగ్‌ విధానాల్లో లోపం కారణంగా చేనేతకు ప్రదర్శన శాలలే లాభదాయకంగా ఉంటున్నాయి. ఇప్పుడవీ సాగకపోవడంతో రూ.1,500 కోట్లకు పైగా క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జర్మనీ, జపాన్‌ వంటి దేశాలకు చీరలు, ఇతర వస్త్రాల ఎగుమతులు జరిగేవి. ఎగుమతులు ఇప్పట్లో పునఃప్రారంభమయ్యే అవకాశాలూ కనిపించడం లేదు.

తెలుగురాష్ట్రాల్లో దీనావస్థ..

చేనేత రంగం తెలుగు రాష్ట్రాల్లో దీనావస్థలోనే ఉందని చెప్పాలి. సంఘాల వద్ద చీరలు, ఇతర వస్త్రాల నిల్వలు పేరుకుపోయాయి. ధర్మవరం, వెంకటగిరి, చీరాల, కొత్తకోట, పోచంపల్లి, గద్వాల, కొత్తవాడ, నారాయణపేట, కొయ్యలగూడెం, జమ్మికుంట తదితర ప్రాంతాల్లో కొంతమంది కార్మికులు సొంతంగా ఇళ్లలో గుంట మగ్గాలపై చీరలు నేస్తున్నారు. సరకు విపణికి చేరక అవి ఇళ్లల్లోనే ఉండిపోతున్నాయి. నూలు అమ్మకాలు నిలిచిపోవడంతో ఇళ్లల్లోనూ పనులు ఆగిపోయే దుస్థితి దాపురించింది. వీరికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కనీస ఆదాయాలు కొరవడి జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పౌరసరఫరాలపైనే ప్రధానంగా ఆధారపడుతున్నారు.

భవితకు భరోసా ఏదీ?

కరోనా పరిస్థితులతో చేనేత రంగం భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశంలో కేవలం 43.31లక్షల మంది మాత్రమే ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతం వారు 36.33 లక్షలు. పట్టణ ప్రాంతాల్లోని వారు కేవలం 6.98లక్షలు. తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికుల సంఖ్య గత పదేళ్లలో 40శాతం తగ్గింది. ప్రస్తుతం లక్షన్నర మంది మాత్రమే ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే మొత్తంగా వృత్తికే ముప్పు వస్తుందనే భయాలు నెలకొన్నాయి. చేనేత సంఘాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. మున్ముందు ఈ రంగానికి చేయూత లభించడంపైనా అపనమ్మకాలు వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్‌ తరవాతి పరిణామాలు ఎలా ఉన్నా, చేనేతకారులకు అత్యవసర సాయం అవసరం. చేనేత రంగానికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఇవ్వాలి. పట్టు నూలు, హాంక్‌ రూపంలో పత్తి నూలు, జరీ తదితర ముడిపదార్థాల రవాణాపై ఆంక్షలు ఎత్తి వేయాలి. తగినంత సరఫరాను పొందడం ద్వారా నేత కార్మికుల జీవనోపాధిని పునరుద్ధరించడానికి ఉత్పత్తి కార్యకలాపాలను సిద్ధం చేయాలి. చేనేత ఉత్పత్తులు, ముడిపదార్థాలపై జీఎస్టీని రద్దు చేయాలి. చేనేత అమ్మకాలను ప్రోత్సహించాలి. ముద్ర వంటి పథకాల ద్వారా రుణసాయం కల్పించడం అవసరం. కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న నేపథ్యంలో చేనేత కార్మికుల ఆరోగ్యసంరక్షణను కీలకంగా భావించాలి.

- ఆకారపు మల్లేశం, రచయిత

ఇదీ చదవండి: నిర్బంధితులపై నిఘా... సమతూకమే కీలకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.