గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే, అతడి అనుచరులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన వ్యవహారంపై పూర్తి వివరాలతో కూడిన స్థితి నివేదికను సమర్పించనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం. అత్యున్నత న్యాయస్థానానికి ఈ రిపోర్టును శుక్రవారం అందించనున్నట్టు ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు.
దుబే, అతడి అనుచరుల ఎన్కౌంటర్తో పాటు 8మంది పోలీసుల మృతిపై విచారించేందుకు మాజీ న్యాయమూర్తి నేతృతంలో ఓ కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇదే విషయంపై దాఖలైన వ్యాజ్యాలను ఈ నెల 20న విచారించనున్నట్టు తెలిపింది.
దుబే ఎన్కౌంటర్ ఇలా...
ఉత్తర్ప్రదేశ్లో తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై కాల్పులకు తెగబడి.. ఎనిమిది మంది మరణానికి కారణమయ్యాడు గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. గ్యాంగ్స్టర్ను వెతకటం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
కొన్నిరోజుల తర్వాత మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ ప్రాంతంలో అతడిని అరెస్టు చేశారు పోలీసులు. దుబేను కాన్పుర్కు తరలిస్తుండగా వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా భద్రతా సిబ్బంది నుంచి తుపాకీ లాక్కొని కాల్పులు జరపగా.. ఆత్మరక్షణ కోసం తాము జరిపిన ఎదురుకాల్పుల్లో దుబే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.