అంతర్జాతీయ కళల ఉత్సవం గుజరాత్లోని వడోదరాకు కొత్త సొబగులు అద్దింది. దేశ, విదేశాల కళాకారులు వేసిన వర్ణచిత్రాలతో నగరం మెరిసిపోతోంది.
జనవరి 5న మొదలైన కళల పండుగకు 19 దేశాలకు చెందిన 27 మంది చిత్రకారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొందరు కుడ్య చిత్రాలకు ప్రాణం పోయగా...మరి కొందరు శిల్పాలను తీర్చిదిద్దారు. నగరంలోని ప్రముఖ కూడళ్లు, బస్టాండ్ గోడలు ఇప్పుడు సరికొత్త రీతిలో దర్శనమిస్తున్నాయి.
"నేను వడోదరా కోసం మ్యూరల్స్ వేస్తున్నాను. ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. గుజరాత్ మాలో స్ఫూర్తిని నింపింది. ముఖ్యంగా వడోదరా కళాత్మకత కలిగి ఉంది. ఇక్కడి ప్రజలు చిత్రకారులను చాలా బాగా ఆదరిస్తున్నారు."
-మీకా, బెల్జియం కుడ్య చిత్రకారిణి
"బరోడా కళలకు, సంస్కృతికి పెట్టింది పేరు. బరోడాలో వర్ణచిత్రాలు, శిల్పాలు, సంగీతం, నాటక రంగాల్లో దిగ్గజ కళాకారులు, కళాప్రేమికులు ఉన్నారు. మా ఆహ్వానం మన్నించి వచ్చి... అద్భుత చిత్రాలు వేసిన వారందరికీ ధన్యవాదాలు."
-శాలిని అగర్వాల్, వడోదరా జిల్లా కలెక్టర్
నెల రోజులపాటు జరిగిన ఈ అంతర్జాతీయ ఆర్ట్ ఫెస్టివల్ నేటితో ముగిసింది.