కరోనా సోకినా ఎలాంటి రోగ లక్షణాలు లేనివారిలో పది రోజుల్లో వైరస్ బలహీనపడుతుందని, ఇతరులకు సంక్రమించగలిగే శక్తి దానికిక ఉండదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అంటువ్యాధుల విభాగం అధిపతి డాక్టర్ గంగాఖేడ్కర్ స్పష్టంచేశారు. అందుకే పది రోజుల్లో మళ్లీ పరీక్షలు చేయాల్సిన అవసరం లేకుండానే వారిని డిశ్ఛార్జి చేయాలని నిర్దేశించినట్లు తెలిపారు.
"కరోనా వైరస్ నిర్వీర్యం అయిపోయినప్పటికీ మనిషి గొంతు కండరాల్లో మూడు నెలల పాటు జీవించి ఉంటుంది. ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ కోసం తెమడను ఈ కణాల నుంచి సేకరిస్తారు. కనుక మనిషిలో రోగ లక్షణాలు లేకపోయినా పరీక్షల ఫలితం పాజిటివ్‌గానే వస్తుంటుంది. ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం వైరస్ సోకిన వ్యక్తిలో వరసగా మూడు రోజులు జ్వరం లాంటి లక్షణాలు లేకపోతే అతని శరీరంలో వైరస్ బలహీనపడినట్లే లెక్క. క్రియాశీలక వైరస్ మాత్రమే మరొకరికి వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలోనే డిశ్ఛార్జి విధానాన్ని మార్చాం. ప్రస్తుత సమాచారం ప్రకారం శరీరంలో వైరస్ 7-8 రోజుల్లో బలహీనపడుతోంది. అలా నిశ్చలంగా మారిన వైరస్‌కు సంక్రమణ శక్తి ఉండదు. 2వేల మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఐసీఎంఆర్ చేసిన అధ్యయనం ప్రకారం లక్షణాలు కనిపించిన పదో రోజు రోగులందరిలో ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ వస్తోంది. అందువల్ల డిశ్ఛార్జి విధానంలో మార్పులు చేయడం మంచిదే." - డాక్టర్ గంగాఖేడ్కర్, ఐసీఎంఆర్ అంటువ్యాధుల విభాగం అధిపతి
వ్యూహాలు మారుస్తున్నాం
గులేరియా మాట్లాడుతూ వైరస్ గురించి కొత్త విషయాలు తెలుసుకునే కొద్దీ వ్యూహాలు మారుస్తున్నట్లు చెప్పారు. 'ప్రజల్ని, బాధితుల్ని రక్షించుకుంటూనే ఆసుపత్రులపై భారాన్ని తగ్గించడంపై మనం దృష్టి సారించాల్సి ఉంది. పాజిటివ్ వచ్చిన వారిలో పది రోజుల పాటు ఎలాంటి లక్షణాలు కనిపించకుండా, వరుసగా మూడు రోజులు జ్వరం రాకుండా ఉంటే తర్వాత ఏడు రోజుల పాటు ఇంట్లో ఉండమని చెప్పి ఆసుపత్రి నుంచి పంపించవచ్చు' అని చెప్పారు.
ఇదీ చూడండి: 'కాలాపానీ'పై నేపాల్‌కు భారత్ కౌంటర్-చారిత్రక ఆధారాలేవి!