కరోనా వ్యాప్తి కారణంగా పెద్దసంఖ్యలో గుమిగూడటంపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహణపై కీలక తీర్పును ప్రకటించింది సుప్రీంకోర్టు. జూన్ 23న ప్రారంభం కానున్న ఈ యాత్రను భక్తులు లేకుండా జరుపుకునేందుకు అనుమతినిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆలయ ధర్మకర్తలు సుప్రీం మార్గదర్శకాలన్నీ తప్పక పాటించాలని సూచించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పూరీ రథయాత్ర నిర్వహణపై విచారణ చేపట్టింది. ఒడిశా ప్రభుత్వం.. కేంద్ర సర్కారు, ఆలయ నిర్వాహకులతో సమన్వయంచేస్తూ రథయాత్రను నిర్వహించాలని మార్గనిర్దేశం చేసింది.
ప్రజారోగ్యంపై రాజీ లేదు..
కరోనా వేళ ప్రజల ఆరోగ్యంపై రాజీపడేది లేదని స్పష్టం చేసింది సుప్రీం. అయితే పూరీలో మాత్రమే రథయాత్రకు అనుమతిస్తున్నామని.. మిగతా ప్రాంతాల్లో యాత్ర నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా రథయాత్రను నిర్వహిస్తామని ఒడిశా ప్రభుత్వం.. న్యాయస్థానానికి నివేదించింది. అయితే తమ నిర్ణయాన్ని తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
భారత్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పూరీ జగన్నాథ రథయాత్రను ప్రజల్లేకుండా జరిపేందుకు అనుమతించాలని కేంద్రం అంతకుముందు సుప్రీంకోర్టును కోరింది. కేంద్రం వాదనకు ఒడిశా ప్రభుత్వం సైతం మద్దతుగా నిలిచింది. దీంతో దీనిపై స్పందించిన సుప్రీం.. ఈ అంశంపై లోతైన విచారణ జరిపేందుకు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
ఏర్పాట్లపై సీఎం నవీన్ సమీక్ష..
సుప్రీం తీర్పు నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పూరీ రథయాత్ర ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులు, ఆలయ ధర్మకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.