కరోనా మహమ్మారి విద్యార్థులకు తీరని తిప్పలు తెచ్చిపెట్టింది. ఆన్లైన్ క్లాసులు పెట్టి టీచర్లు సిలబస్ అయితే పూర్తి చేస్తున్నారు కానీ, ఆ తరగతులు వినడానికి విద్యార్ధులు నానా తంటాలు పడుతున్నారు. నగరాల్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి కాస్తో కూస్తో మేలు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఇక్కట్లతో ఆన్లైన్ తరగతులకు హాజరు కాలేకపోతున్నారు విద్యార్థులు. దక్షిణ కర్ణాటకలో విద్యార్థులు సిగ్నల్స్ కోసం కొండలు, గుట్టల మధ్య టెంట్లు వేసుకుని కూర్చుంటున్నారు.
దక్షిణ కర్ణాకలోని శిబజే గ్రామ పంచాయతీ సహా, పెర్లా, పసోడి, మయార్ది, పట్టిమారు, నిరానా, భండిహోళె, బూడడమక్కి గ్రామాల్లో ఇప్పటికీ సెల్ టవర్ లేదు. ఇంటర్నెట్ సౌకర్యం అసలే లేదు. దీంతో దాదాపు 400 మంది విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు హాజరయ్యేందుకు కష్టాలు పడుతున్నారు.
ఇప్పటివరకు ఓ కొండపై కాసింత సిగ్నల్ వచ్చే చోట గుడారులు వేసుకుని తరగతులకు హాజరయ్యారు. అడవి దోమల బెడదకు మస్కిటో కాయిల్స్ పెట్టుకుని సర్ధుకున్నారు. కొంత మంది గుళ్లు, బస్ స్టాండ్లలో సిగ్నల్స్ కోసం ప్రయత్నించి క్లాసులు విన్నారు. కానీ, ఇప్పుడు వానాకాలం మొదలయ్యింది. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
12 ఏళ్లుగా ఓ సెల్ టవర్ పెట్టించమని అధికారులు, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు గ్రామస్థులు. కానీ, లాభం లేకపోయింది. వారి నిర్లక్ష్యం ఇప్పుడు వందలాది మంది విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామస్థులు.
ఇదీ చదవండి: ఆ మాస్టారు చెప్పే 'లౌడ్ స్పీకర్ క్లాసు'లకు పిల్లలు ఫిదా