కర్ణాటక ఉడిపిలో విద్యార్థుల సేద్యం బడిలో పాఠాలు నేర్చుకుంటున్నారు. అన్నం విలువ, చదువు గొప్పతనం తెలియజేసేందుకు కన్నడనాట ఓ పాఠశాల వినూత్న కార్యక్రమం చేపట్టింది. ప్రకృతి ఒడిలో పాఠాలు చెప్పేందుకు పూనుకుంది.
వ్యవసాయ పాఠాలను విద్యార్థులకు ప్రయోగాత్మకంగా నేర్పించే ప్రయత్నంలో బడి పిల్లలను యూనిఫాంలోనే పొలం బాట పట్టించారు నిర్వహకులు. ఆపై ఆడుతూ పాడుతూ , పొలంలో అల్లరి చేస్తూ ఒరితో ఒకరు ముచ్చటిస్తూ హాయిగా ఐకమత్యంగా వ్యవసాయం చేశారు విద్యార్థులు.
"మాది దక్షిణ కర్ణాటక.. మా ఊర్లో వరి పండించరు.. కేవలం కొబ్బరి తోటలు వంటివే వేస్తారు. అందుకే నాకు ఇప్పటి వరకు వరిని ఎలా సాగు చేస్తారో తెలియదు. ఇలా వ్యవసాయం చేయడం నాకేంతో నచ్చింది. కొత్త విషయాలు తెలుసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మా బడిలో విద్యతో పాటు వ్యవసాయం నేర్పుతున్నారు " - కవిత, విద్యార్థిని
పిల్లలకు సేద్యం ఎందుకు?
ఇక్కడి విద్యార్థులకు వ్యవసాయం పట్ల మక్కువ పెరిగేందుకు.. ఉపాధ్యాయులు ప్రకృతి గురించి సరికొత్త పాఠాలు నేర్పుతున్నారు. వ్యవసాయ పాఠాలెందుకు అనుకునేవారిని ఆలోచించేలా చేస్తున్నారు.
'కలం పట్టే సుతిమెత్తని చేత్తో విత్తనాలు చల్లినప్పుడే కదా.. ఒక పూట కడుపు నిండాలంటే ఎంత కష్టపడాలో తెలిసేది. వృథాగా పెరిగిన కలుపు తీస్తేనే కదా సమాజంలోని రుగ్మతల్ని ఏరిపారేయాలని బోధపడేది. కొడవలి పట్టి వరిపైరును కోస్తేనే కదా పంట కోసం.. రైతు పడిన కష్టం తెలిసేది. మోత మోసి ఏకం చేస్తేనే కదా పొదుపు చేసే విధానం అర్థమయ్యేది. మోపులు దంచి ధాన్యం తీస్తేనే కదా.. ఓహో సాధించామని గర్వపడేది.'
అని చెప్పే ప్రకృతి బోధన నచ్చిన విద్యార్థులు సేద్యం పంచే మధురానుభూతలను కూడగట్టుకున్నారు. వ్యవసాయం మాకెంతో నచ్చిందని చెబుతూ మురిసిపోతున్నారు.
ఏటా ఇంతే
ఏటా ధాన్యం విలువ, వ్యవసాయ ప్రాధాన్యం, రైతు కష్టం తెలిసేలా ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారు పాఠశాల నిర్వాహకులు. ఏదో ఒక రకంగా గజిబిజీ జీవితాల్లో నలిగిపోయే వారికి అయిదేళ్లుగా కాస్త ప్రకృతి పరిమళాన్ని అద్దుతున్నారు.
ఇదీ చదవండి: కాశీలో అంగరంగ వైభవంగా 'అతిరుద్ర యాగం'