నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను వేర్వేరుగా ఉరితీసేలా ఆదేశాలివ్వాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ వ్యాజ్యంపై మార్చి 5న వాదనలు వింటామని జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.
మరణశిక్ష అమలు పదేపదే వాయిదా పడుతున్న నేపథ్యంలో దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ ఇటీవల కేంద్ర హోంశాఖ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే నిబంధనల ప్రకారం ఒకే కేసుకు సంబంధించిన దోషులను వేర్వేరుగా ఉరితీయడం కుదరదని చెబుతూ ప్రభుత్వ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు ఇదివరకే కొట్టేసింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కేంద్రం. ఈ పిటిషన్ నేడు విచారణకు రాగా.. ఈ కేసులో దోషుల ఉరికి కొత్త డెత్ వారెంట్లు జారీ అయినట్లు అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం పిటిషన్‌పై విచారణను ధర్మాసనం మార్చి 5కు వాయిదా వేసింది.
నిర్భయ దోషులను మార్చి 3న ఉరితీసేందుకు ఇటీవల పటియాలా హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది.
ఇదీ చదవండి:అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్లో ఓ గ్రామం!