మెరుగైన చికిత్స, వ్యాధిపై అవగాహన పెరగడంతో కొవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 57,381 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని పేర్కొంది. రికవరీ రేటు 71.61శాతానికి చేరుకుందని వెల్లడించింది.
‘టెస్టు, ట్రాక్, ట్రీట్’లో భాగంగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,68,679 కొవిడ్-19 పరీక్షలు చేశామని ప్రభుత్వం తెలిపింది. ఫలితంగా ఇప్పటి వరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 2.85 కోట్లకు చేరుకుందని వెల్లడించింది. 12 రాష్ట్రాల్లో రికవరీ రేటు జాతీయ సగటు కన్నా మెరుగ్గా ఉందని ప్రశంసించింది. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకుంటున్న వారు 50% కన్నా ఎక్కువగా ఉన్నారని వెల్లడించింది.
దిల్లీలో అత్యధికంగా 89.87% మంది కోలుకున్నారు. గుజరాత్ 77.53%, మధ్యప్రదేశ్ 74.70%, పశ్చిమ్‌బెంగాల్ 73.25%, రాజస్థాన్ 72.84%, తెలంగాణ 72.72%, ఒడిశాలో 71.98% తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 18,08,936 మంది కొవిడ్-19 నుంచి కోలుకోవడంతో యాక్టివ్, రికవరీ కేసుల మధ్య అంతరం 11,40,716 (శనివారం)కు చేరుకుందని కేంద్రం తెలిపింది. శనివారానికి మొత్తంగా 6,68,220 యాక్టివ్ కేసులు ఉన్నాయని మొత్తం కేసుల్లో ఇవి 26.45 శాతమేనని వెల్లడించింది. మెరుగైన చికిత్స, వైద్యుల పర్యవేక్షణ వల్ల మరణాల రేటు 1.94%కి తగ్గిందని పేర్కొంది.
ఇదీ చూడండి జమ్ముకశ్మీర్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు