బహిరంగ ప్రదేశాల్లో చెత్తా చెదారం లేకుండా స్వచ్ఛతను పాటించే నగరాల జాబితాను కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. మొత్తం ఆరు నగరాలకు '5 స్టార్ గార్బేజ్ ఫ్రీ' రేటింగ్ ఇచ్చినట్లు తెలిపారు.
5 స్టార్ రేటింగ్ జాబితాలో అంబికాపుర్(ఛత్తీస్గఢ్), రాజ్కోట్, సూరత్, మైసూర్, ఇండోర్, నవీ ముంబయి నగరాలకు చోటు దక్కినట్లు పూరీ స్పష్టం చేశారు.
కర్నాల్, న్యూదిల్లీ, తిరుపతి, విజయవాడ, ఛండీగఢ్, భిలాయ్ నగర్, అహ్మదాబాద్ నగరాలు 3 స్టార్ గార్బేజ్ ఫ్రీ రేటింగ్ పరిధిలోకి వచ్చినట్లు తెలిపారు పూరీ. దిల్లీ కంటోన్మెంట్, వడోదర, రోహ్తక్ నగరాలు 'వన్ స్టార్ గార్బేజ్ ఫ్రీ' జాబితాలో ఉన్నట్లు తెలిపారు.
మొత్తం 141 నగరాలకు రేటింగ్ ఇచ్చింది కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ. ఆరు నగరాలకు 5 స్టార్, 65 నగరాలకు 3 స్టార్, 70 నగరాలకు ఒక స్టార్ రేటింగ్ ఇచ్చినట్లు తెలిపింది. మొత్తం 1,435 నగరాలు స్టార్ రేటింగ్ మదింపు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆ శాఖ కార్యదర్శి దుర్గ శంకర్ మిశ్రా వెల్లడించారు. రేటింగ్ కోసం 1.19 కోట్ల మంది ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టినట్లు తెలిపారు. 10 లక్షల జియోట్యాగ్ ఫొటోలను పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ర్యాంకింగ్ ఇలా!
స్వచ్ఛత, పరిశుభ్రత పాటించడంలో అత్యున్నత ప్రమాణాలు చూపించిన నగరాల ఆధారంగా ఈ జాబితా రూపొందిస్తారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా నగరాలకు 1 నుంచి 7 స్టార్ల రేటింగ్ ఇస్తారు. చెత్త సేకరణ, తడి-పొడి చెత్త వేరు చేయడం, బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడం, డ్రైనేజీ వ్యవస్థ సహా మొత్తం 12 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితా తయారు చేస్తారు.