తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ మార్పే లక్ష్యంగా రాజకీయాల్లో అడుగుపెడుతున్నానని ప్రకటించారు. త్వరలోనే పార్టీ నెలకొల్పనున్నట్లు చెన్నైలో వెల్లడించారు.
అధికారంపై తనకు ఎలాంటి వ్యామోహం లేదని ఉద్ఘాటించారు రజనీ. ప్రజల్లో ఆదరణ, నీతి, నిజాయితీ ఉన్నవాళ్లకే సీఎంగా అవకాశం కల్పిస్తానని తెలిపారు. తాను పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఉంటానని స్పష్టం చేశారు. తన ప్రభుత్వంలో పార్టీ అధ్యక్షుడికి ఎలాంటి ప్రాధాన్యం ఉండదని తేల్చిచెప్పారు.
మార్పే లక్ష్యం
వ్యవస్థను సరిచేయకుండా మార్పు రావాలని కోరుకోవడం సరికాదన్నారు రజనీ. మంచివాళ్లు రాజకీయాల్లోకి రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు.
యువతకు పెద్దపీట
తన పార్టీలో 65 శాతం యువకులకు అవకాశం కల్పిస్తాన్ననారు రజనీ. పార్టీలో 50 ఏళ్ల లోపువారికే 60-65 శాతం అవకాశాలు ఇస్తానని హామీ ఇచ్చారు. యువత క్రియాశీలకంగా పనిచేసి రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని ఆకాంక్షించారు సూపర్‌స్టార్.
నాటి ప్రకటనకు కట్టుబడి..
రెండేళ్ల క్రితం రాజకీయాల్లోకి వస్తానని మొదటిసారిగా చెప్పానని గుర్తు చేశారు రజనీ. 2017లో చేసిన ప్రసంగాన్ని మరోసారి ప్రసారం చేయించారు. నాడు పదవులపై వ్యామోహం లేదని ప్రకటించానని.. దానికే కట్టుబడి ఉంటున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: పార్టీ అధ్యక్షుడిగానే ఉంటా.. పదవులపై వ్యామోహం లేదు: రజనీ