రాజస్థాన్‌లో రాజకీయ వేడి కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తిరుగుబావుటాతో సీఎం అశోక్ గహ్లోత్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యేలను బస్సుల్లో రిసార్టులకు తరలిస్తున్నారు. మొత్తం 107 మంది ఎమ్మెల్యేల మద్దతు గహ్లోత్ ప్రభుత్వానికే ఉన్నట్లు గహ్లోత్ వర్గం ప్రకటించింది. అయితే, ఈ సమావేశానికి 97 మంది హాజరయ్యారని తెలుస్తోంది. ఇద్దరు మంత్రులు సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. కేవలం 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సచిన్ వర్గం వైపు ఉన్నట్లు తెలుస్తోంది. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని నిన్న సచిన్ పైలట్ ప్రకటించడం గమనార్హం.
కొనసాగుతున్న మంతనాలు
ఓ వైపు సీఎల్పీ సమావేశాన్ని వేదికగా చేసుకుని బలప్రదర్శన చేసిన కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు రెబల్ నేత సచిన్ పైలట్‌తో బుజ్జగించే ప్రయత్నాలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తోంది. సీఎల్పీ సమావేశానికి ముందు ఆ పార్టీ నేత రణ్‌దీప్ సూర్జేవాలా.. పైలట్‌కు ద్వారాలు తెరిచే ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆ పార్టీ అగ్రనాయకులు రాహుల్, ప్రియాంక, చిదంబరం, కేసీ వేణుగోపాల్ సైతం సచిన్ పైలట్‌తో మాట్లాడినట్లు సమాచారం.
కేబినెట్ విస్తరణ?
అశోక్ గహ్లోత్‌పై అసంతృప్తితో ఉన్న సచిన్ పైలట్‌ను సంతృప్తి పరిచేందుకు కేబినెట్ విస్తరణ చేపట్టాలని ఓ వైపు కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుతం అశోక్ గహ్లోత్ వర్గానికి చెందిన వారే మంత్రివర్గంలో ఎక్కువ మంది ఉండగా.. కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించి పైలట్ వర్గానికి చోటు కల్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో భాజపా రంగంలోకి దిగితే ఎమ్మెల్యేలు చేజారిపోయే ప్రమాదాన్ని ముందే ఊహించిన ఆ పార్టీ మధ్యప్రదేశ్‌లా మరో ప్రభుత్వాన్ని కోల్పోకూడదని తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలిస్తోంది.