కరోనా రోగులకు ఉపశమనం కల్పిస్తోన్న కొత్త ఔషధాన్ని వినియోగించేందుకు పుణెలోని ససూన్ జనరల్ ప్రభుత్వ ఆస్పత్రి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న కనీసం 25 మంది రోగులకు ‘టోసిలిజుమాబ్ ఔషధాన్ని త్వరలోనే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
" ఈ కొత్త ఔషధం విలువ సుమారు రూ. 20వేల వరకు ఉంటుంది. తొలి దశలో 25 మంది రోగులకు ఇవ్వనున్నాం. ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలపై పుణె మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంటుంది. కొవిడ్-19 రోగులు తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో టొసిలిజుమాబ్ ఇచ్చేందుకు డా. డీబీ కదమ్ నేతృత్వంలో ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. కరోనా సోకిన రోగుల్లో 50 ఏళ్లలోపు వారిలో సైటోకైన్ స్టోర్మ్ లక్షణాలతో పాటు, జ్వరం, ఆక్సిజన్ అవసరమైన వారికి ఈ మందును టాస్క్ఫోర్స్ సిఫార్సు చేస్తుంది. "
- శేఖర్ గైక్వాడ్, పుణె పురపాలక కమిషనర్
భారతీ ఆస్పత్రిలో కరోనా ప్రభావంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అంగన్వాడీ కార్యకర్తకు టొలిసిజుమాబ్ అందించినట్లు తెలిపారు గైక్వాడ్. ఆమె అనుహ్య రీతిలో కోలుకుందన్నారు. ముంబయిలోని సివిల్ ఆస్పత్రిలో కూడా ఈ మందును వినియోగించగా.. మంచి ఫలితాలు వచ్చినట్లు తెలిపారు.
దేశంలోనే మహారాష్ట్ర కరోనా కేసుల్లో తొలిస్థానంలో ఉంది. అందులో పుణె జిల్లా ముంబయి తర్వాత రెండోస్థానంలో ఉంది. ఇప్పటి వరకు 4,809 కేసులు నమోదు కాగా 242 మంది ప్రాణాలు కోల్పోయారు.