జీవితంలో బాధ్యతాయుతంగా ఉన్న వ్యక్తులకే అవకాశాలు మెండుగా లభిస్తాయని, భారంగా భావించే వారే విఫలమవుతారని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 21వ శతాబ్దంలో యువత స్పష్టమైన ఉద్దేశాలతో, కల్మషం లేని మనసుతో ముందుకు సాగాలని సూచించారు.
పండిట్ దీన్దయాల్ పెట్రోలియం విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవంలో వర్చువల్గా పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 45 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన మోనోక్రిస్టలిన్ సోలార్ ఫొటో వోల్టాయిక్ ప్యానల్ ప్లాంట్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
"కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఇంధన రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో మీరు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈ సమయంలో వ్యవస్థాపకత, ఉపాధి వృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. దేశంలో కార్బన్ వినియోగాన్ని 30-35 శాతానికి తగ్గించాలనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. ఈ దశాబ్దంలో దేశ ఇంధన అవసరాల్లో సహయవాయువు వినియోగాన్ని 4 రెట్లు పెంచాలనే లక్ష్యంతో ఉన్నాం. దేశీయ పెట్రోలియం శుద్ధి సామర్థ్యాన్ని వచ్చే ఐదేళ్లలో రెండింతలు చేసే పనులు జరుగుతున్నాయి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
స్నాతకోత్సవం సందర్భంగా అదే యూనివర్సిటీలోని సౌరవిద్యుత్ కేంద్రం సహా పలు ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించారు మోదీ. ఈ స్నాతకోత్సవం ద్వారా సుమారు 2,600 మంది విద్యార్థులు తమ డిగ్రీ/డిప్లోమాలను పొందారు.
ఇదీ చూడండి: కార్మికులకు ఆరోగ్యమస్తు!