వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.
ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్ 2020, ద ఫార్మర్స్ (ఎంపవర్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ 2020, నిత్యావసరాల చట్టం (సవరణ) బిల్లు 2020కు రాష్ట్రపతి సమ్మతి తెలిపినట్లు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇటీవలి పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో బిల్లులు చట్టరూపం దాల్చాయి. రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా విక్రయించుకునే అవకాశాన్ని ఈ చట్టాలు కల్పిస్తాయి.
ఇదీ చూడండి: గందరగోళం మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం
వీటితోపాటు కశ్మీరీ, డోంగ్రీ, హిందీని జమ్ముకశ్మీర్ అధికారిక భాషల జాబితాలో చేర్చుతూ రూపొందించిన బిల్లుకూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్ 26నే ఈ జమ్ముకశ్మీర్ అధికారిక భాషల బిల్లు-2020కి రాష్ట్రపతి సమ్మతి లభించినట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఆందోళనల నడుమ..
రైతుల ఆందోళనలు, బిల్లులను వెనక్కి పంపాలన్న విపక్షాల అభ్యర్థనల నడుమ రాష్ట్రపతి వ్యవసాయ బిల్లులను ఆమోదించారు. ఈ బిల్లులకు సంబంధించి అభిప్రాయభేదాలతో ఎన్డీఏ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ఆ కూటమి నుంచి విడిపోయింది. అంతకుముందు ఆ పార్టీ నేత హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఇంకా ఈ బిల్లులకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో రైతు సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్, హరియాణాలో నిరసనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే వ్యవసాయ బిల్లులపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. 7 రాష్ట్రాల్లో 15 రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్‌లు, మీడియా సమావేశాలు, వెబినార్లు నిర్వహించాలని పార్టీ సభ్యులకు, కార్యకర్తలకు ఆదేశాలిచ్చింది.
ఇదీ చూడండి: వ్యవసాయ బిల్లులపై అవగాహనకు భాజపా ప్రచారాలు
బిల్లులు ఏం చెబుతున్నాయి...?
1. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020
రైతులకు తమ ఉత్పత్తులను ప్రభుత్వామోదిత ఏపీఎంసీ మార్కెట్ వెలుపల విక్రయించుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. రైతులకు సులభమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ మార్గాలను కల్పించడం దీని ఉద్దేశం. ఈ చట్టం ప్రకారం రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడం వల్ల వారి నుంచి ఎలాంటి సెస్‌ను గానీ పన్నులనూ వసూలు చేయరు.
2. రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020
రైతులు నేరుగా అగ్రికల్చర్ బిజినెస్ సంస్థలు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులు, పెద్ద రిటైలర్లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.
తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెలు వంటి ఉత్పత్తులను నిత్యావసర వస్తువల జాబితా నుంచి తొలగించాలని ఈ బిల్లు చెబుతోంది.