టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి చోటు దక్కించుకున్నారు. 2020 ఏడాదికి గానూ మోదీతో పాటు షహీన్ బాగ్ ఆందోళనను ముందుండి నడిపిన 82 ఏళ్ల బిల్కిస్ కూడా ఆ జాబితాలో నిలవడం విశేషం.
ప్రతి ఏడాది టైమ్ మ్యాగజైన్ ఆ సంవత్సరంలో ఎక్కువగా ప్రభావం చూపిన 100 మంది వ్యక్తులను వివిధ కేటగిరీలుగా విభజించి జాబితాను సిద్ధం చేస్తుంది. ఈసారి దానిలో మోదీ, బిల్కిస్, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా స్థానం సంపాదించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత టైమ్ జాబితాలో స్థానం దక్కించుకోవడం ఇది నాలుగో సారి. గత ఏడాది కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దిల్లీలో వందల సంఖ్యలో ప్రజలు ఆందోళనకు దిగారు. షహీన్ బాగ్ దాదీగా పేరుపొందిన బిల్కిస్ ఆ నిరసనల్లో కీలకంగా వ్యవహరించారు.
టైమ్ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా తదితరులకు చోటు లభించింది.
ఇదీ చూడండి- పరీక్షలు, చికిత్సల సామర్థ్యాన్ని పెంచాలి: మోదీ