ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ హ్యాకథాన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 2020 ఆగస్టు 1 రాత్రి 7 గంటలనుంచి జరిగే ఈ కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఈ మేరకు ప్రకటన చేశారు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఐ4ఈ సంస్థలు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి.
సమస్యల పరిష్కారానికి..
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నిర్వహణకు సంబంధించి జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ అధ్యక్షత వహించారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమం ఎంతో వినూత్నమైన ప్రక్రియ అని పోఖ్రియాల్ పేర్కొన్నారు. మనదేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను, సమస్యల పరిష్కారం కోసం సృజనాత్మక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కసరత్తు జరిపేందుకు ఇదో వినూత్న మార్గమని చెప్పారు.
"డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపకల్పన చేసే పోటీలో ఈ కసరత్తు నిర్విరామంగా, నిరాటంకంగా సాగుతుంది. ఇందులో సాంకేతిక వరిజ్ఞానం కలిగిన విద్యార్థులు వివిధ సమస్యలకు సృజనాత్మక పరిష్కారం సూచించేలా ఆయా సమస్యలను విద్యార్థులకు పరిచయం చేసేందుకు హ్యాకథాన్‌లో వీలవుతుంది. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, శాఖలు, ప్రైవేటు రంగ సంస్థలు ఎదుర్కొనే సవాళ్లకు పరిష్కారం కనుగొనే కసరత్తులో విద్యార్థులు పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు అప్పటికప్పుడు, ప్రపంచ ప్రమాణాలతో కూడిన పరిష్కారాలు సూచించగలరు."
- రమేశ్ పోఖ్రియాల్, కేంద్ర మంత్రి
10 వేల మంది విద్యార్థులు..
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్- 2020కి సంబంధించి తొలిదశ కార్యక్రమం గత జనవరిలో కళాశాల స్థాయి హ్యాకథాన్ ద్వారా ఇప్పటికే నిర్వహించారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో నిపుణులు, మదింపుదారులు మరింత వడపోత జరిపి, గ్రాండ్ ఫైనల్లో పాల్గొనే బృందాలను ఎంపిక చేశారు. దేశంలో ప్రస్తుతం కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో గ్రాండ్ ఫైనల్‌ను ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ సంవత్సరం 37 కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన 243 సమస్యాత్మక అంశాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 17 సమస్యలు, పరిశ్రమలకు సంబంధించిన 20 సమస్యలకు పరిష్కారాలపై చర్చ జరగనుంది. ఇందులో పదివేల మందికి పైగా విద్యార్థులు పోటీ పడబోతున్నారు. ప్రతి సమస్యాత్మక అంశానికి రూ. లక్ష బహుమతి ఉంటుంది. విజేతలకు వారి స్థాయి ఆధారంగా 3 బహుమతులు ఇస్తారు.