ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. పేదల డబ్బును బడా వ్యాపారులకు దోచిబెట్టారని ఆరోపించారు.
బిహార్‌లోని సమస్తీపుర్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి రాహుల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
న్యాయ్ పథకం కింద పేదలకు ఏటా రూ.72వేలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీపై విమర్శలను రాహుల్ తోసిపుచ్చారు. ఆ కార్యక్రమం కోసం పన్నులు పెంచమని, మోదీ పాలనలో లాభపడ్డ బడా వ్యాపారవేత్తల నుంచే డబ్బు రాబడతామని చెప్పారు.
"ఐదేళ్లలో మోదీ పేదలపై మెరుపుదాడి చేశారు. న్యాయ్ పథకం.. ఇది కాంగ్రెస్ పార్టీ పేదరికంపై చేస్తున్న మెరుపుదాడి. బిహార్ యువత... ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటే ఏ ప్రభుత్వ కార్యాలయం నుంచి అనుమతి అవసరం లేకుండా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ వారికి నేరుగా బ్యాంకు రుణాలు ఇప్పిస్తుంది. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్‌మాల్యా నుంచి మొత్తం డబ్బులు వసూలు చేసి బిహార్ యువత బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. మోదీ ఒక్క మాట వినండి... మీరు లాలూకు చేసిన అవమానానికి 2019 ఎన్నికల్లో బిహార్ ప్రజలు సమాధానం చెబుతారు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
- ఇదీ చూడండి: ఏప్రిల్ 26 ముప్పు: రాహుల్ విమానంలో సమస్య