దేశవ్యాప్తంగా దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్డౌన్ ప్రభావం రోజూవారి కూలీలపైనా భారీగా పడింది. దిల్లీలోని వలసయేతర కార్మికుల వారపు ఆదాయం కనీసం 57 శాతం తగ్గిందని అమెరికా, కెనడా విశ్వవిద్యాలయాలు చేసిన సంయుక్త అధ్యయనంలో తేలింది.
అధ్యయనం కోసం 1,392 మంది వలసయేతర కూలీల నుంచి సమాచారాన్ని సేకరించారు. వీరిలో ఎక్కువ మంది దిల్లీ అనధికార స్థావరాల్లో నివసిస్తున్నారు. 2018, 2019, లాక్డౌన్ సమయంలో (మార్చి27 నుంచి మే 13) మధ్య ఈ సర్వే జరిపారు.
ఆదాయం నిల్...
మే మొదటి వారం నాటికి, ప్రతి 10మందిలో తొమ్మిది మందికి వారపు ఆదాయం సున్నాకి పడిపోయిందని షికాగో, బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయాలు నిర్వహించిన అధ్యయనం తెలిపింది. లాక్డౌన్కు ముందు, ఆ తర్వాత వలసయేతర కార్మికుల ఆర్థిక స్థితిగతులను అధ్యయనంలో పోల్చి చూశారు పరిశోధకులు.
మేము నిర్వహించిన సర్వేలో.. లాక్డౌన్కు ముందు వారపు ఆదాయం సగటు రూ.2,994కాగా.. మొదటి లాక్డౌన్లో రూ.1,828కు తగ్గింది. ఇక రెండో రౌండ్లో రూ.412కు పరిమితమైంది.
--పరిశోధకులు
ఆంక్షల సమయంలో మరోవైపు మానసిక, భావోద్వేగ సమస్యలు, ఆహార సరఫరాలో సవాళ్లు, అధిక ధరలు వంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయని అధ్యనయం తెలిపింది. ఇంతగా ఆదాయ నష్టం ఉన్నప్పటికీ, కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రకు ప్రభుత్వం విధించిన ఆదేశాలను ప్రజలు పాటిస్తున్నారని వెల్లడించింది.
లాక్డౌన్ వల్ల వలసయేతర కార్మికుల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ.. వారి ప్రవర్తనా నియమావళిలో ఎంతో మార్పు వచ్చింది. ప్రజలు ఎక్కువగా మాస్కులు ధరిస్తున్నారు. ఇళ్లలోనే ఉంటూ, భౌతిక దూరం పాటిస్తున్నారు. రోజూ చేతులను శుభ్రం చేసుకుంటున్నారు.
కెన్ లీ, షికాగో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్.
లాక్డౌన్ కారణంగా 80శాతం మంది ప్రజలు కరోనాతో ఆందోళన చెందినట్లు అధ్యయనం పేర్కొంది. మార్చి 25 నుంచి కరోనాపై మీడియో కార్యక్రమాలు 56శాతం పెరిగాయని వివరించింది.