వలస కార్మికులకు సంబంధించి సరైనా డేటా ఆవశ్యకత ఎంతో ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. వలస కార్మికులకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్య శిక్షణ వంటి చర్యల కోసం అధికారులు వీటిని పరిగణించవచ్చని పేర్కొన్నారు. లాక్డౌన్ నుంచి దేశం నిష్క్రమిస్తున్న నేపథ్యంలో వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
పేద, రోజువారీ కూలీలు, రైతులు, చిన్న వ్యాపారులపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడిందని, అది ఎంతో దురదృష్టకరమైన విషయమని వెల్లడించారు వెంకయ్య. కరోనా వైరస్, దానికి సంబంధించిన విషయాలపై ఫేస్బుక్లో చేసిన పోస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యానించారు ఉపరాష్ట్రపతి.
"దేశంలో ఉన్న వలస కూలీలకు సంబంధించిన డేటా ఆవశ్యకతను ఇటీవలి కాలంలో జరిగిన పరిస్థితులు గుర్తుచేస్తున్నాయి. ఈ డేటాను రూపొందిస్తే.. వలస కూలీలకు ఉద్యోగం, నైపుణ్య శిక్షణ వంటి అంశాల్లో ప్రభుత్వానికి సహాయపడుతుంది. పేదలు, ముఖ్యంగా వలస కూలీలను సమస్యల నుంచి దూరం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయి. అదే సమయంలో వలస కార్మికుల సంక్షేమం కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలపై వారికి అవగాహన కల్పించడం ఎంతో అవసరం."
-- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి.
వైరస్ వ్యాప్తిలో ఒకప్పుడు విచిత్రంగా, నమశక్యంకానివిగా కనపడిన పరిస్థితులే.. ఇప్పుడు సాధారణ జీవనశైలిగా మారిపోయాయని అభిప్రాయపడ్డారు వెంకయ్య. అభివృద్ధి చెందిన దేశాల కన్నా భారత్ ఎంతో అద్భుతంగా వైరస్‌ను నియంత్రించగలిగిందని ప్రశంసించారు. లాక్డౌన్ లేకపోయుంటే మృతుల సంఖ్య అనేక రెట్లు అధికంగా ఉంటుందన్న నిపుణులు వ్యాఖ్యలను గుర్తు చేశారు.
అయితే ఇన్ని సానుకూలతలు అన్‌లాక్-1 వల్ల వృథా అవకూడదని స్పష్టం చేశారు ఉపరాష్ట్రపతి. రానున్న వారాలు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. అతి త్వరలోనే పరిస్థితులు సద్దుమణిగేందుకు ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేయాలన్నారు.
ఇదీ చూడండి:- అడవి పందుల కోసం పెడితే ఏనుగు చనిపోయిందట!