కేరళలో ఓ హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడిని 25 ఏళ్ల తర్వాత అరెస్టు చేశారు పోలీసులు.1995లో ముస్లిం లీగ్ కార్యకర్త మనాఫ్ హత్య తర్వాత యూఏఈకి పారిపోయాడు షఫీక్ మాలంగదాన్. కరోనా నేపథ్యంలో తరలింపులో భాగంగా షార్జా నుంచి కోజికోడ్ రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నీలంబర్ ఎమ్మెల్యే పీవీ అన్వర్ అల్లుడు షఫీక్. బుధవారం కోజికోడ్ విమానాశ్రయానికి షఫీక్ చేరుకోగా.. అతనిపై పెండింగ్‌లో ఉన్న లుక్అవుట్ నోటీసును గుర్తించారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. అనంతరం ఎదవణ్న పోలీసులకు అప్పగించారు.
25 ఏళ్లపాటు..
1995 ఏప్రిల్ 13న మనాఫ్ హత్య జరిగింది. ఈ కేసులో 26 మంది నిందితుల జాబితాలో అన్వర్ కూడా ఉన్నారు. అయితే అనంతరం ట్రయల్ కోర్టు అతనితో పాటు 21 మందిని నిర్దోషులుగా తేల్చింది. మిగతా నలుగురు నిందితుల్లో.. షఫీక్, అతని సోదరుడు షెరిఫ్తోపాటు మరో ఇద్దరు పరారయ్యారు.
వీరిపై కేరళ హైకోర్టు లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మిగతా ముగ్గురు పోలీసులకు లొంగిపోయారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత షఫీక్ కూడా అరెస్టయ్యాడు. షఫీక్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఇదీ చూడండి: ఆ ఒక్క కారణంతో 18 వేల మంది ఖైదీలు విడుదల