అంతర్జాతీయ బహుపాక్షిక విధానం తీవ్ర ప్రమాదంలో ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు చేపట్టేందుకు ప్రపంచదేశాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన జైశంకర్.. సంస్కరణలు ప్రసంగాలకే పరిమితం కావద్దన్నారు.
"ఇప్పుడు ఉన్న పద్ధతిలోనే కొనసాగితే చాలా కష్టం. ఐరాసలో అందరికీ తగిన ప్రాధాన్యం ఉండదు. ముఖ్యంగా 5 శాశ్వత సభ్య దేశాల ఆధిపత్యం కొనసాగితే ఐరాస విశ్వసనీయత తగ్గిపోతుంది. దీన్ని ప్రపంచం ఎంతమాత్రం కోరుకోదు. సంస్కరణలు ప్రసంగాలకే పరిమితం కాకుండా వాటికోసం నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది."
- జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
గడిచిన 15 ఏళ్లుగా ఐరాసలో సంస్కరణల ప్రక్రియ ఎటూ కదలటం లేదన్నారు జైశంకర్. ఏటా చర్చలు జరుగుతూనే ఉన్నా సమస్య మళ్లీ మొదటికే వస్తోందన్నారు.
మోదీ కూడా..
సెప్టెంబర్లో జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ.. ఈ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించారు. సమగ్రమైన సంస్కరణలు జరగకపోతే ఐరాసపై నమ్మకం సన్నగిల్లుతుందని హెచ్చరించారు. కాలం చెల్లిన విధానాలతో ప్రస్తుత సమస్యలపై పోరాడలేమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'మానవ హక్కుల సాకుతో చట్టాల ఉల్లంఘనను సహించం'