కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగా ఇతోధికంగా సాయపడుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. భారతీయ సంప్రదాయంలో భాగమైన యోగా వల్ల దేశాల మధ్య ఐక్యత పెరుగుతుందని ఉద్ఘాటించారు. విశ్వమానవ సోదర భావాన్ని యోగా పెంపొందిస్తుందన్నారు. వర్గం, శరీర రంగు, ఆడ-మగ, విశ్వాసం, దేశం అనే వివక్షను యోగా చూపదని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రాణాయామం ద్వారా శ్వాసక్రియను మెరుగుపరచవచ్చన్నారు.
ప్రాణయామంతో..
వైరస్‌పై పోరాటంలో ఉపకరించే రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగాలో ఆసనాలున్నాయని చెప్పారు మోదీ. యోగాలో భాగమైన ప్రాణయామం ఇందుకు ఎంతో ఉపకరిస్తుందని వెల్లడించారు. అనేక రకాల ప్రాణయామాలు నేర్చుకోవాలసిన అవసరం ఉందని చెప్పారు.
'యోగా అవసరం ప్రపంచానికి తెలిసింది'
కరోనా వేళ ప్రపంచ దేశాలకు యోగా అవసరం తెలిసిందని పేర్కొన్నారు మోదీ. రోగాలను దీటుగా ఎదుర్కొనేందుకు యోగా దోహదపడుతుందని చెప్పిన ప్రధాని యోగా ద్వారా అనేక ఇబ్బందులను అధిగమించగల్గుతామని వెల్లడించారు. యోగా ద్వారా శాంతి, సహనశక్తి పెంపొందుతాయని పేర్కొన్నారు. యోగా ద్వారా మనోధైర్యం, ఉల్లాసం పెంపొందుతాయని తెలిపారు.
ఇంట్లోనే యోగా డే..
కరోనా ఉద్ధృతి దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నామని చెప్పిన ప్రధాని.. ఇళ్లలోనే ఉంటూ కుటుంబసభ్యులతో కలిసి యోగా వేడుకలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చూడండి: యోగా డే: ఇంత సింపుల్ ఆసనంతో అన్ని లాభాలా?