వలస కూలీల కష్టాలు ఎంత అంటే ఏం చెప్పగలం? వారు పడ్డ యాతనను మనం ఎలా వివరించగలం? లాక్డౌన్ వేళ హరియాణాలో వ్యయప్రయాసలకోర్చి ఇంటికి చేరుకున్న ఓ వలస కూలీని.. ప్రయాణం ఎలా సాగిందని అడిగితే....
'కూటి కోసం సొంత గూటిని వదిలి.. కూలీ కోసం ఊరు తల్లిని వదిలి.. పట్టణానికి వచ్చా. కరోనా మహమ్మారి వల్ల పుట్టిన లాక్డౌన్ వచ్చిన చోటుకే పొమ్మని తరిమింది. ఊరికి తీసుకుపోయే బస్సులు లేక కాలినడక మొదలెట్టా.
చంటి బిడ్డలను కడుపున గట్టుకున్నా. మూటముల్లె నెత్తిన పెట్టుకుని పయనమయ్యా. భగభగమండే సూరీడు నాపై నిప్పులు కురిపిస్తున్నా ఓర్చుకున్నా. నిలువెల్లా చెమటలు చిమ్ముతున్నా సముదాయించుకున్నా. పాదాలకు అగ్గి సెగలు తాకుతున్నా ఆగలేదు. ఆకలి కడుపును పిసికేస్తూంటే.. కన్నీళ్లు పెట్టుకుని మంచినీళ్ల కోసం వెతుక్కున్నా.
రోడ్డు మీద నుంచి వెళ్లొద్దని పోలీసన్నలు లాఠీ ఝళిపిస్తే.. సామానంతా చెల్లాచెదురుగా పారేసి అడవిలోకి పారిపోయా. దారి తెలియకపోయినా తోటివారితో సాగిపోయా. చిమ్మచీకటి కమ్ముకున్నా.. ఇల్లు చేరేంతవరకు ఆగకూడదనుకున్నా. మేము చేసిన తప్పేంటో తెలియక.. అడుగు అడుగుకు గుండె బరువు పెరుగుతుంటే.. మోయలేక సొమ్మసిల్లిపడిపోయా. అప్పుడొచ్చింది మా ఊరికి పోయే బస్సు' అని చెప్తాడు కాబోలు!
ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక