కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు ఇప్పుడు అందరూ మాస్కులు ధరిస్తున్నారు. అయితే అవి గంటల తరబడి ముఖంపైనే ఉండటంతో చర్మ సమస్యలు రావచ్చని, చిన్న చిన్న జాగ్రత్తలతో వీటిని అధిగమించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కుల కింద ముక్కు, బుగ్గలపై ఎక్కువగా చెమట పడుతుంటుంది. కన్నీళ్లు సైతం వాటిపైకే చేరి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మాస్కులు ధరించే వారెవరైనా ముందుగా ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.
మాస్కు పెట్టుకొనేందుకు కనీసం అరగంట ముందు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ముఖ్యంగా వైద్య సిబ్బంది చర్మానికి బిగుతుగా వీటిని కట్టుకుంటారు. వీరు రెండు గంటలకోసారి రోగుల నుంచి దూరంగా వచ్చి సురక్షిత ప్రాంతంలో వదులు చేసుకొని ముఖం కడుక్కోవడం ఉత్తమం. సాధారణ ప్రజలు సైతం మాస్కుల కింద చర్మం శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడంతో పాటు చెమట పట్టకుండా చూసుకోవాలి. ఏ మాత్రం గరుకుగా, దురదగా అనిపించినా దాన్ని మార్చాలి.