దేశ రాజధాని దిల్లీలో కొవిడ్ వ్యాప్తి తీవ్రతను పసిగట్టేందుకుగాను త్వరలో సీరలాజికల్ సర్వే చేపట్టనున్నారు. అందులో భాగంగా 20వేల మంది నమూనాలను పరీక్షించనున్నారు. దిల్లీలో మహమ్మారి నానాటికీ మరింతగా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సహా పలువురు ఉన్నతాధికారులు అందులో పాల్గొన్నారు.
ఈనెల 27 నుంచి వచ్చే నెల 10వ తేదీ మధ్య సీరలాజికల్ సర్వే నిర్వహించాలని షా ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఒక పెద్ద ఆస్పత్రిని కరోనా చికిత్స కోసం ప్రత్యేక దవాఖానాగా గుర్తించాలని సూచించారు. కొవిడ్ బాధితులు, మృతుల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పక్కాగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్బంధంలో ఉన్నవారి వివరాలనూ తమ దృష్టికి తీసుకురావాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: జాగ్తే రహో: ఆశ చూపించి డబ్బులు కొట్టేస్తారు!