అదరాలకు రంగులద్దనిదే అతివల అలంకరణ పూర్తి కాదు. కానీ, ప్రతిరోజు పెదాలకు రసాయనాలు పూస్తే.. ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమంటున్నారు శాస్త్రవేత్తలు. అందుకే, మగువల మృదువైన పెదాలను పరిరక్షించేందుకు కొత్తరకం లిప్‌స్టిక్‌లను తయారు చేస్తోంది... హిమాలయ జీవ వనరుల సాంకేతిక పరిశోధన సంస్థ-ఐహెచ్బీటీ. శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన సంస్థ-సీఎస్ఐఆర్కు అనుబంధంగా పనిచేస్తుంది ఐహెచ్బీటీ.
హిమాచల్‌ప్రదేశ్ పాలంపుర్లోని సీఎస్ఐఆర్-ఐహెచ్బీటీ ప్రయోగశాల... తాజా కూరగాయలతో లిప్‌స్టిక్‌ల తయారీకి వైదికైంది.
"మన దగ్గర క్యాబేజ్, నల్ల క్యారెట్ వంటి ఎన్నో కూరగాయలు లభిస్తాయి. వాటి నుంచి రంగులను తీయొచ్చు. మా సంస్థలో గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించి కూరగాయల నుంచి రంగులను ఉత్పత్తి చేశాం. దేశ, విదేశాల్లో మహిళలు లిప్‌స్టిక్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. కానీ, లిప్‌స్టిక్ తయారీలో ఉపయోగించే రంగులు ఆరోగ్యానికి ఎంతో హానికరం. వాటిని పెదాలకు పూస్తే.. పొట్టలోకి వెళ్తాయి. అందుకే, మేము ప్రాకృతిక రంగులతో లిప్‌స్టిక్ తయారు చేయాలని నిర్ణయించాం."
-డా. సంజయ్ కుమార్, సీఎస్ఐఆర్-ఐహెచ్బీటీ డైరక్టర్
కూరగాయల నుంచి తీసిన రంగులా..? అయితే వాటిలో మనకు కావల్సిన షేడ్స్ దొరకవు అనుకుంటే పొరపాటే.
"మా సంస్థ ఉత్పత్తి చేసిన ప్రాకృతిక రంగులను ఆహారంలో ఉపయోగిస్తున్నారు. ఆ రంగులతోనే ఇప్పుడు మేము హెర్బల్ లిప్‌స్టిక్ తయారు చేశాం. ఇవి పింక్, పర్పుల్, చెర్రీ రెడ్, ఆరెంజ్ రంగుల్లో లభ్యమవుతాయి. ఇవి కాస్త కూడా హానికరమైనవి కావు. ఇందులో ఎలాంటి రసాయనాలు లేవు."
- డా. పమిత, శాస్త్రవేత్త
ఇప్పుడంటే.. రసాయన లిప్‌స్టిక్‌లు కొనడం తప్ప వేరే అవకాశం లేదు కాబట్టి మహిళలు వాటినే ఉపయోగిస్తున్నారు. కానీ, త్వరలో తాజా కూరగాయల లిప్‌స్టిక్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది సీఎస్ఐఆర్. ఇక, అతివలకు ఆరోగ్యకరమైన అందం సొంతమైనట్టే!
ఇదీ చదవండి: తినగానే ఈ ఏడు పనులు చేస్తున్నారా... అయితే జాగ్రత్త!