'ఏనుగు ఏనుగు నల్లనా.. ఏనుగు కొమ్ములు తెల్లనా' అంటూ పరిచయమై బాల్యంలోనే మన మనసులు దోచుకున్నాయి గజరాజులు. ఏనుగును దేవుళ్లతో సమానంగా కొలిచే దేశం మనది. భారీ కాయంతో సున్నిత మనస్సుతో ఉంటుంది కాబట్టి 'మా ఫేవరెట్ జంతువు ఏనుగు' అని చెప్పడమే గానీ, ఆ అమాయక వదనాల వెనక ఎంతటి శోకం ఉందో ఎవ్వరూ పట్టించుకోరు. కానీ, కేరళకు చెందిన ఓ టీచర్ మాత్రం దాదాపు 35 ఏళ్లుగా ఏనుగుల కన్నీటి గాథలను సేకరిస్తున్నారు.
ఏనుగు ఘోష వినిపిస్తూ..
కేరళ పతనంతిట్ట జిల్లాకు చెందిన ఎమ్ఎమ్ జోసెఫ్.. తైక్కవులోని ఓ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. జోసెఫ్ మంచి రచయిత, తోలు బొమ్మలు ఆడించే కళ కూడా తెలుసు. వీటన్నింటికంటే, జోసెఫ్‌కు ఏనుగులంటే అమితమైన ప్రేమ. అందుకే, 35 ఏళ్లుగా ఏనుగుల వార్తలను సేకరిస్తున్నారు. ఏనుగులు ఎదుర్కొంటున్న సమస్యలను అందరికీ తెలియజేస్తున్నారు. దంతాలు కాజేసే మానవుల వల్ల అవి హింసకు గురవుతున్న తీరుపై అవగాహన కల్పిస్తున్నారు.
ఏటా ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ, ఏనుగుల సంరక్షణ కోసం ఏం చేస్తున్నాం? కానీ, జోసెఫ్ న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లలో ఏనుగుల సంరక్షణ ప్రాముఖ్యతను తెలిపేలా ఏ వార్త కనిపించినా.. వాటిని సేకరించి భద్రంగా దాచేస్తారు. అలా ఇప్పటివరకు దాదాపు 3 వేలకు పైగా కథనాలను సేకరించారు. అంతేనా... వాటిని అవి ప్రచురితమైన తేదీలతో సహా.. ఓ ఆల్బమ్ లో అతికించారు. ఈ ఆల్బమ్‌ను కుదిరినప్పుడల్లా స్థానిక పాఠశాలలకు తీసుకెళ్లి విద్యార్థులకు ఏనుగు పాఠాలు బోధిస్తారు. ఇలా వినూత్న పద్ధతిలో ఏనుగుల పట్ల ప్రేమను చాటుకుంటున్నారు.
ఇదీ చదవండి: నీట మునిగిన దేశం.. నిండా మునగకూడదంటే?