కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సారి అంతర్జాతీయ యోగా డే వేడుకలను 'యోగా ఎట్ హోం అండ్ యోగా విత్ ఫ్యామిలీ' పేరిట పూర్తిగా డిజిటల్ ప్లాట్ఫాంలలోనే నిర్వహిస్తున్నారు. యోగా ఔత్సాహికులు ఉదయం నుంచే ఆసనాలతో వేడుకల్లో భాగస్వాములయ్యారు. ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా హరిద్వార్‌లోని పతంజలి యోగా పీఠ్‌లో ఆసనాలు వేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్ వడోదర లోని యోగా నికేతన్.. వర్చవల్‌గా యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. 15 దేశాలకు చెందిన పలువురు పాల్గొని కొవిడ్-19పై ముందుడి పోరాటం చేస్తోన్న వారికి కృతజ్ఞతగా 108 సూర్య నమస్కారాలు చేశారు.
విదేశాల్లోని భారతీయ సంఘాలు యోగా డేను డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా జరుపుతున్నాయి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే యోగాపై అవగాహన పెంచేందుకు 'మై లైఫ్- మై యోగా' వీడియో బ్లాగింగ్ పోటీలను మోదీ చేతుల మీదుగా మే 31న ప్రారంభించింది భారత సాంస్కృతిక సంబంధాల సమాఖ్య. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని యోగా ద్వారా పెంచుకోవచ్చని తెలిపింది.
ఈ పోటీలను భారత్‌లో, అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. ఒక్కో దేశంలో నిర్వహించిన పోటీ నుంచి ఒక్కో విజేతను ఎంపిక చేస్తారు. వారంతా అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనాలి.
3 నిమిషాలు 3 ఆసనాలు
పోటీలో పాల్గొనేవారు 3 యోగాసనాలతో 3 నిమిషాల నిడివి గల వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలి. #MyLifeMyYogaINDIA హ్యాష్‌ట్యాగ్ జత చేయాలి. యోగా ద్వారా తమ జీవితంలో వచ్చిన మార్పుపై సందేశమివ్వాలి.
యువత, పెద్దలు, యోగా వృత్తిలో ఉన్నవారికి మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన మొదటి ముగ్గురు విజేతలకు 2500డాలర్లు, 1500డాలర్లు, 1000డాలర్లతో పాటు ట్రోఫీని బహుమతిగా ఇస్తారు.
భారత్‌లో మొత్తం ఆరు విభాగాల్లో యోగా పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా రూ.లక్ష, రూ.50వేలు, రూ.25వేలు అందజేస్తారు . ఆదివారంతో పోటీదారులకు ఇచ్చిన గడువు ముగుస్తుంది. విజేతల పేర్లను జ్యూరీ ప్రకటిస్తుంది.