ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో తక్కువ కొవిడ్ కేసులు, మరణాలు నమోదవుతన్నాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు కేంద్రం తీసుకున్న సమర్థమైన చర్యల వల్లే ఇది సాధ్యమైందని పేర్కొంది.
ప్రపంచంలో ప్రతి పది లక్షల జనాభాలో 5,552 మంది కొవిడ్ బారిన పడగా.. భారత్‌లో 5,790 కేసులే నమోదవుతున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. భారత్ కంటే అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, యూకే, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు.
కొవిడ్‌తో 87మందే..
భారత్‌లో ప్రతి 10 లక్షల జనాభాలో 87మంది కొవిడ్-19తో మరణిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు 148తో పోల్చుకుంటే చాలా తక్కువని మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశంలో కొవిడ్ మరణాల రేటు 1.50గా ఉంది. వైరస్ బాధితులను సమయానికి గుర్తించి సమర్థమైన చికిత్స అందించడం వల్లే మరణాల సంఖ్య తగ్గిందన్నారు.
కరోనా పరీక్షలు నిర్వహించిన దేశాల్లో భారత్ ముందువరుసలో ఉందన్న అధికారులు.. ఇప్పటివరకు 10.50కోట్ల నమూనాలు టెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: సైనిక బలగాలపై రక్షణమంత్రి ప్రశంసల జల్లు