మానవాళికే పెను ముప్పుగా మారిన కరోనా భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 468 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీరిలో 40 విదేశీయులు. మొత్తం బాధితుల్లో 35 మంది కోలుకున్నట్లు స్పష్టం చేశారు అధికారులు. మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రస్తుతం 424 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపారు.
ఇవాళ బంగాల్, హిమాచల్ ప్రదేశ్లలో తొలి కరోనా మరణాలు సంభవించాయి. కొవిడ్ ధాటికి మహారాష్ట్రలో ఇద్దరు, గుజరాత్, బిహార్, కర్ణాటక, పంజాబ్‌ల్లోనూ ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో ఒక్కరోజే 28మందికి..
కేరళలో వైరస్ విజృంభిస్తోంది. సోమవారం మరో 28 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కేసుల సంఖ్య 91కి చేరింది. ఈ నేపథ్యంలో మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 64 వేల మందికి పైగా వైద్యుల పరిశీలనలో ఉన్నట్లు తెలిపిన అధికారులు.. మరో 323 మందిని ఐసోలేషన్ వార్డులకు తరలించినట్లు స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో 23..
మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 23 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 97కి చేరింది.
గుజరాత్లో..
గుజరాత్‌లోను క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ అవుతున్నాయి. తాజాగా 12 మంది వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం 30 మందికి మహమ్మారి సోకినట్లయింది.
ఉత్తరాఖండ్‌లో...
ఉత్తరాఖండ్‌లో మరో కరోనా కేసు నమోదైనట్లు రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. దీంతో వైరస్ బాధితుల సంఖ్య నాలుగుకు చేరింది.
ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి...
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నమోదైన మొత్తం కేసులు ఇలా ఉన్నాయి. కర్ణాటకలో 33, రాజస్థాన్‌లో 32 (ఇద్దరు విదేశీయులు), ఉత్తర ప్రదేశ్‌లో 33 (ఒక విదేశీయుడు), దిల్లీలో 29, హరియాణాలో 26( 14 మంది విదేశీయులతో), పంజాబ్‌లో 21, లద్దాఖ్‌లో 13, తమిళనాడులో 9, బంగాల్లో 7, మధ్యప్రదేశ్‌లో 6, చండీగఢ్‌లో 6, ఆంధ్రప్రదేశ్‌లో 7, జమ్ముకశ్మీర్‌లో 4, బిహార్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్‌ల్లో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి. పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కొక్కరు చొప్పున వైరస్ బారిన పడినట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి.
ఇదీ చూడండి:'లాక్డౌన్'ను ఉల్లంఘిస్తే 6 నెలలు జైల్లో గడపాల్సిందే!