మెదడులో కణతితో బాధపడుతున్న తొమ్మిదేళ్ల చిన్నారికి మధ్యప్రదేశ్ బిర్లా ఆసుపత్రి వైద్యులు వినూత్నంగా శస్త్రచికిత్స నిర్వహించి విజయం సాధించారు. ఆపరేషన్ చేయించుకుంటూనే పియానో వాయిస్తూ చిన్నారి కనిపించింది. 'క్రేనియోటమీ' శస్త్రచికిత్స విధానం ద్వారా చిన్నారికి కేవలం కణతి ఉన్న ప్రాంతంలోనే మత్తు ఇచ్చి ఆపరేషన్ చేశామని వైద్యులు తెలిపారు.
బాలికకు సర్జరీ 3 రోజుల క్రితం చేయగా.. ఆమె శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయింది. అనంతరం.. ఈ విషయాన్ని డాక్టర్లు పంచుకున్నారు.
అందుకే పియానో..
మధ్యప్రదేశ్ మురైనా జిల్లా బాన్మోర్ నగరానికి చెందిన తొమ్మిదేళ్ల సౌమ్య.. మెదడుకు సంబంధించిన వ్యాధితో బిర్లా ఆసుపత్రిలో చేరింది. వైద్య పరీక్షల్లో చిన్నారి మెదడులో కణతి ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు. ట్యూమర్ మెదడులోని సున్నితమైన ప్రదేశంలో ఉంది. ఆపరేషన్ సమయంలో చిన్నారికి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. దీంతో శస్త్రచికిత్స సమయంలో బాలిక మూర్చపోకుండా పియానో వాయించమని సూచించినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారితో మాట్లాడుతూ ఆపరేషన్ చేశామన్నారు. ప్రస్తుతం చిన్నారి సౌమ్య ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యిందని, బాలిక పూర్తి ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఈ ఆపరేషన్ను ఓ అద్భుత విజయంగా అభివర్ణించారు.
ఇదీ చదవండి : రోజూ ఒక గుడ్డు ఎందుకు తినాలంటే.?