తలసేమియాతో బాధపడుతున్న కుమారుని ప్రాణం కాపాడేందుకు ఓ బిడ్డకు జన్మనిచ్చారు అతని తల్లిదండ్రులు. ఎముక మజ్జను దానం చేసేందుకు ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) పద్ధతి ద్వారా జన్మనిచ్చి కుమారుడి ప్రాణం కాపాడటంలో విజయవంతమయ్యారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సహదేవ్ సింగ్ సోలంకి, అల్పా సోలంకికి ఆరేళ్ల కుమారుడు అభిజిత్ తీవ్రమైన తలసేమియాతో బాధపడుతున్నాడు. అతను బతకాలంటే ప్రతి నెల రక్తమార్పిడి చికిత్స చేయాల్సి ఉంటుంది. అలా చేసినా ఎంత కాలం జీవిస్తారో చెప్పలేని దుస్థితి. అయితే, ఎముక మజ్జ మార్పిడి చేయిస్తే పరిస్థితి మెరుగుపడవచ్చని చెప్పారు వైద్యులు.
మ్యాచ్ దొరకలేదు..
కానీ, అభిజిత్‌కు సరిపోయే హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్ (హెచ్ఎల్ఏ) లభించలేదు. అతని కుటుంబ సభ్యుల్లో ఎవరితోనూ మ్యాచ్ కాలేదు. ఫలితంగా హెచ్ఎల్ఏ మ్యాచ్ అయ్యే ఎముక మజ్జ కోసం ఐవీఎఫ్ ద్వారా మరో బిడ్డను కనాలని వారికి సూచించారు. ఇలాంటి తీవ్రమైన వ్యాధులతో బాధేపడేవారికి మూలకణ మార్పిడికి ఈ పద్ధతి(సేవియర్ సిబ్లింగ్)ని వినియోగిస్తారు.
ఏడాది తర్వాత..
ఇలా ఐవీఎఫ్ ద్వారా అభిజిత్ తల్లి.. ఏడాది క్రితం కావ్యకు జన్మనిచ్చింది. కావ్య హెచ్ఎల్ఏ.. అభిజిత్‌కు సరిపోయింది. కావ్య నిర్ణీత బరువు పెరిగే వరకు ఎదురుచూసిన వైద్యులు.. ఈ ఏడాది మార్చిలో విజయవంతంగా ఎముక మజ్జ మార్పిడి చేశారు. ఇప్పుడు అభిజిత్‌కు ప్రమాదం తప్పిందని, ఇక ప్రతి నెల రక్తమార్పిడి అవసరం లేదని వైద్యులు తెలిపారు.
మూలకణాల మార్పిడి కోసం ఐవీఎఫ్ ద్వారా జన్మనిచ్చిన కేసు భారత్‌లో ఇదే మొదటిది.
ఇదీ చూడండి: తస్మాత్ జాగ్రత్త: పొగతాగేవారికి కరోనాతో అధిక ముప్పు