కర్ణాటక రాయ్చుర్ జిల్లా సింధనూరులో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి నలుగురి దారుణ హత్యకు దారితీసింది. రాయచూర్ జిల్లా సింధనూరులో ఓ యువతి ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో వరుడి కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను దారుణంగా నరికి చంపారు.
ఇదీ జరిగింది...
సింధనూర్ చెందిన మౌనేశ్, మంజుల ప్రేమించుకున్నారు. కొన్ని నెలల క్రితం పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. అయితే తల్లిదండ్రులను చూడాలని మంజుల తన భర్తను కోరింది. భార్య కోరిక మేరకు దంపతులిద్దరు ఆమె ఇంటికి వెళ్లారు. వారిని చూసిన మంజుల కుటుంబం.. ఇద్దరిని చంపుతామని బెదిరించారు.
బాధతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన దంపతులు బెదిరింపు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం స్టేషన్కు బయలుదేరారు. ఈ విషయాన్ని గమనించిన మంజుల కుటుంబ సభ్యులు.. మౌనేశ్ ఇంటికి వెళ్లి నలుగుర్ని అత్యంత దారుణంగా నరికి చంపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానికులు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మౌనేశ్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి:రొయ్యల ద్వారా కరోనా.. దిగుమతులను నిలిపివేసిన చైనా!