నాన్నల దినోత్సవం నాడే సమాజం తలదించుకునే పని చేశాడో వ్యక్తి. ఏడిస్తే బుజ్జగించి, తన చేతులతో ఆ చిన్నారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఆ తండ్రే కిరాతకుడయ్యాడు. ఎత్తుకొని లాలించడం మానేసి.. దారుణంగా కొట్టి మంచం పైనుంచి విసిరేశాడు. కేరళలోని అంగమల్లో జరిగిన ఈ ఘటనలో.. 54 రోజుల ఆ పాపాయి క్లిష్ట పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
బిడ్డను కొట్టిన తండ్రి షైజూ థామస్.. తాను కొట్టలేదని, కిందపడి గాయాలయ్యాయని బుకాయించాడు. నిందితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా.. అతడే కొట్టినట్లు తేలింది.
మద్యం సేవించినప్పుడు క్షణికావేశానికి గురై థామస్ ఇలా ప్రవర్తిస్తుంటాడని పోలీసులు తెలిపారు.

గతంలోనూ ఇలాగే రెండుసార్లు ఆ చిన్నారిని మంచం పైనుంచి తోసేశాడని థామస్ భార్య చెప్పింది.
ఇదీ చదవండి: 20 హత్యల సైనైడ్ మోహన్‌కు బుధవారం శిక్ష!