భారతీయ జనతా పార్టీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు ప్రయత్నిస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే ప్రధాని, కేంద్రమంత్రుల వాహనాలను, వారు వినియోగిస్తున్న హెలికాప్టర్లను కచ్చితంగా తనిఖీ చేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాయకులు.. ముఖ్యంగా 'జెడ్', 'ఎక్స్' కేటగిరీ భద్రత ఉన్న కేంద్రమంత్రులే స్వయంగా డబ్బుల మూటలు అక్రమంగా రాష్ట్రంలోకి తెస్తున్నారని మమత ఆరోపించారు. ఓటర్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
చర్చకు సిద్ధమా.. మోదీకి సవాల్
ఇండో-బంగ్లా సరిహద్దు పర్గానా ప్రాంతమైన హస్నాబాద్లో మమతా బెనర్జీ ఎన్నికల ర్యాలీ చేపట్టారు. మోదీ ఐదేళ్ల పాలనలో సాధించిందేమీ లేదని, ఈ విషయంలో తనతో ముఖాముఖి చర్చకు రావాలని సవాల్ విసిరారు. అలాగే లోక్సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీ తరచూ బంగాల్ పర్యటనకు రావడంపైనా ఆమె విరుచుకుపడ్డారు.
"ఎందుకు ఆయన (మోదీ) తరచూ బంగాల్ వస్తున్నారు? రాష్ట్ర ప్రజల మధ్య విభజన, విభేదాలు సృష్టించాలని ఆయన అనుకుంటున్నారు. ఓటర్లకు పంచడానికి డబ్బుల మూటలను మోదీ తెస్తున్నారు. నా కారు, హెలికాప్టర్లను తనిఖీ చేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంతే కాకుండా కేంద్రమంత్రుల కార్లు, హెలికాప్టర్లనూ తనిఖీ చేయాలి. వారికి ఎలాంటి మినహాయింపు ఇవ్వకూడదు. వారు వివిధ మార్గాల ద్వారా అక్రమంగా డబ్బు తరలిస్తున్నారు."-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
ఇటీవల ఓ భాజపా నేత నుంచి, అలాగే విశ్రాంత ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ నుంచి పోలీసులు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని మమత గుర్తు చేశారు.
ఇదీ చూడండి: "నెహ్రూపై భాజపా నేత వివాదస్పద వ్యాఖ్యలు"