తమిళనాడు పెరంబలూరు కున్నా జిల్లాలో ఇటీవల బయటపడిన అవశేషాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇవి డైనోసార్ గుడ్లు అంటూ ప్రచారం నడుస్తోంది.
డైనోసార్ గుడ్లు కాదు :
సమాచారం అందుకున్న స్థానిక, భూగర్భ, పురావస్తు శాఖల నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకొని వీటిని పరిశీలించారు. ఒక్కోదాని బరువు 200కిలోల వరకు ఉంటుందని తెలిపారు. అయితే, ఇవి డైనోసార్ గుడ్లు కాదని, అమ్మోనైట్ అవక్షేపాలుగా నిర్ధారణకు వచ్చారు. డైనోసార్ గుడ్లు అనే ప్రచారాన్ని కొట్టిపారేసిన నిపుణుల బృందం.. దాదాపు 416 మిలియన్ సంవత్సరాల క్రితం డెవోనియన్ కాలంలో ఏర్పడిన విభిన్న సముద్ర జాతుల సమూహమే అమ్మోనైట్ (అమ్మోనాయిడ్లు) శిలాజాలు అని తేల్చారు.
అదంతా దుష్ప్రచారమే!
కొన్ని భారీ సముద్ర జాతులు శిలాజాల రూపంలో శతాబ్దాల మేరకు మిగిలిపోయి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీటినే డైనోసార్ గుడ్లుగా పేర్కొంటూ దుష్ప్రచారం జరుగుతోందని తెలిపారు. తమిళనాడులోని ప్రస్తుత అరియలూరు, పెరంబలూర్ ఒకప్పుడు సముద్ర గర్భంలో ఉండేవని వెల్లడించారు. దాంతో మిలియన్ల ఏళ్ల క్రితం సముద్ర గర్భంలోని జీవజాలం కొన్ని శిలాజాలుగా మారిపోయిందని వివరించారు. ప్రస్తుతం కనిపించిన ఈ అమ్మోనైట్లు 416 మిలియన్ల సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్న సముద్ర జాతులేనని, ఈ జీవులు ఆక్టోపస్‌లాంటి పలు జీవులతో దగ్గరి పోలికలతో ఉంటాయని తెలిపారు. జూన్ మాసంలో కూడా ఇద్దరు యువకులకు దాదాపు 210 పౌండ్ల బరువు ఉన్న అమ్మోనాయిడ్ మిశ్రమాలు కనిపించగా వీటిని కూడా డైనోసార్ గుడ్లుగా పేర్కొంటూ అప్పట్లోనూ ప్రచారం జరిగింది.
అప్పట్లో అరియలూరులో డైనోసార్లు ఉండేవట!
అయితే, గుడ్డు ఆకారంలో ఉన్న ఈ పురాతన వస్తువుల పొరల లోపల అధ్యయనం చేశాక మాత్రమే అవి డైనోసార్ గుడ్లు శిలాజాలా? కాదా? అని చెప్పగలమని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు, ప్రజలు తరలివస్తున్నారు. అలాగే, మరికొందరు ఇవి అమ్మోనైట్ అవక్షేపాలుగా పేర్కొంటున్నారు. పెరంబలూర్ జిల్లాలో గతంలో అనేక శిలాజాలు, ఘనీభవించిన వస్తువులను కనుగొన్నట్టు కొందరు పురాతన జంతు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తాజాగా గుర్తించినవి మాత్రం డౌనోసార్ గుడ్లు కాదని తేల్చి చెబుతున్నారు. అరియలూరు ప్రాంతంలో 6.5బిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు ఉండేవని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయిని పేర్కొన్నారు.