కొవిడ్ 19 టీకా పంపిణీ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వ్యాక్సినేషన్‌ను పూర్తిస్థాయిలో పర్యవేక్షించడంతో పాటు, ఎవరైనా టీకా కావాలనుకుంటే నమోదు చేసుకోవడానికి వీలుగా కో-విన్ పేరిట ఓ ఉచిత మొబైల్ యాప్‌ను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ రూపొందించింది.
టీకా కోసం నమోదు చేసుకున్నవారి వివరాలు సహా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని (డేటా) ఇందులో పొందుపరుస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం టీకా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 'కో-విన్' దోహదపడుతుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మంగళవారం తెలిపారు.
కో-విన్ యాప్‌లో 5 రకాల (అడ్మినిస్ట్రేటర్, రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్, బెనిఫిషరీ ఎకనాలెడ్జ్మెంట్, రిపోర్ట్) మాడ్యూళ్లు ఉంటాయి. వీటిద్వారా వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతారు. టీకా వేసిన తర్వాత క్యూఆర్ ఆధారిత ధ్రువపత్రాలను కూడా అందజేస్తారు. అలాగే ఎన్ని వ్యాక్సిన్ సెషన్లు నిర్వహించారు. వీటికి ఎంతమంది హాజరయ్యారు వంటి వివరాలను కూడా యాప్‌లో ఉంచుతారు.