భారత్లో గత నాలుగు రోజులుగా నమోదైన కరోనా కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. భారత్లో ఇప్పటివరకు 44,97,867 మంది వైరస్ను జయించగా.. ఇది ప్రపంచ వాటాలో 19.5శాతం అన్నారు. అమెరికా వాటా 18.6శాతంగా ఉందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో దేశం వాటా 17.7శాతం కాగా.. అమెరికా షేరు 22.4శాతం అని పేర్కొన్నారు. దేశంలో మొత్తం కేసులు 55,62,663 ఉండగా.. యాక్టివ్ కేసులు అందులో ఐదో వంతు మాత్రమే ఉన్నాయన్నారు భూషణ్.
"దేశంలో 45 లక్షల మంది బాధితులు ఇప్పటికే కోలుకున్నారు. కొవిడ్ మరణాలు అత్యల్పంగా ఉన్నాయి. భారత్లో 10లక్షల మందికి 64 మంది చనిపోతుండగా.. ప్రపంచ సగటు 123గా ఉంది."
-రాజేష్ భూషణ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి
వచ్చే నెల పండుగ సీజన్ కానుండటం వల్ల ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలని సూచించారు కొవిడ్-19 టాస్క్ఫోర్స్ సభ్యుడు వీకే పాల్(నీతి ఆయోగ్ సభ్యుడు). కరోనా నిబంధనలను పాటించకపోతే దేశంలో 80శాతం మంది ప్రజలు మహమ్మారి బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
"మాస్క్లు ధరించే విషయంలో అలసత్వం వద్దు. మాస్క్లు పెట్టుకోవడం వల్ల 36-50శాతం కేసులు తగ్గే అవకాశం ఉంటుంది. పండుగ సీజన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి."
-వీకే పాల్, కొవిడ్-19 టాస్క్ఫోర్స్ సభ్యుడు
కొత్త కేసులు ఇలా..
- ఉత్తర్ప్రదేశ్లో 5,722 కొత్త కేసులు రాగా మొత్తం బాధితుల సంఖ్య 3,64,543కి చేరింది. తాజాగా 77 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 5,212కి చేరింది. ప్రస్తుతం 63,148 యాక్టివ్ కేసులున్నాయి.
- తమిళనాడులో 5,337 కొత్త కేసులు నమోదయ్యాయి. 76 మంది మరణించారు. 5,406 మంది కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,52,674గా, మృతుల సంఖ్య 8,947గా ఉంది.
- దిల్లీలో మరో 3,816 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. 37 మంది మరణించారు. 3,097 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 2,53,075కు, మరణాల సంఖ్య 5,051కి చేరింది.
- రాజస్థాన్లో కొత్తగా 1912 కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. 1528 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 18,164 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 1367 మంది మరణించారు.