కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ... వైరస్ వ్యాప్తి నివారణకు గువాహటి(అసోం)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) పరిశోధకులు 3డీ ముద్రిత పరికరాలను తయారు చేశారు. నోరు, కళ్లు, ముక్కు ద్వారా సాగే వైరస్ వ్యాప్తిపై పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత ప్రత్యేక ఫేస్ షీల్డ్‌ను రూపొందించారు. ఇది ఎంతో చౌక... ధరించడం సులభం. దృఢంగా ఉండే ఈ షీల్డ్‌ను శానిటైజర్లు, ఇతర వైరస్ నివారణ ద్రావణాలతో శుభ్రం చేసుకోవచ్చు.
శ్వాస ద్వారా కరోనా సోకకుండా..
శ్వాస ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు మూడు పొరలతో కూడిన ప్రత్యేక ఫేస్ మాస్కును నైపర్ సృష్టించింది. సూక్ష్మాతిసూక్ష్మ వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఈ మాస్కు విజయవంతంగా అడ్డుకుంటుంది. దీనిని ధరిస్తే ఎలాంటి ఇబ్బందీ లేకుండా చక్కగా శ్వాస ఆడుతుంది. శుభ్రం చేసుకోవడం సులభం.
చేతులకూ 3డీ పరికరాలు..
తలుపులు, కిటికీలు, సొరుగులు తెరిచేందుకు మూసేందుకు, లిఫ్టులు, కంప్యూటర్ల కీబోర్డు మీటలను నొక్కేందుకు, స్విచ్‌లను ఆపేందుకు ముంజేతులతో వాడుకునే హుక్‌ను నైపర్ పరిశోధకులు తయారు చేశారు. చేతుల ద్వారా సాగే వైరస్ వ్యాప్తికి ఈ పరికరాన్ని విరివిగా వాడటం వల్ల అడ్డుకట్ట పడుతుందని నైపర్ పరిశోధకులు చెప్పారు. 'కరోనాపై దేశం సాగిస్తున్న యుద్ధంలో మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగమే ఈ ఆవిష్కరణలు. సమస్య తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ప్రజల ప్రయోజనార్థం ఈ సాంకేతికతను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం' అని నైపర్-గువాహటి డైరెక్టర్ డాక్టర్ యు.ఎస్.ఎన్.మూర్తి చెప్పారు.
ఇదీ చూడండి: 'మధ్యప్రదేశ్ బలపరీక్షపై గవర్నర్ నిర్ణయం సరైనదే'