జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. లక్షలాది మంది వలసకూలీల బాధల గురించి ప్రసంగంలో ప్రస్తావించకుండా విఫలమయ్యారని ఎద్దేవా చేసింది.
వలస కూలీలు స్వస్థలాలకు తరలి వెళ్తున్న దృశ్యాలు హృదయ విదారకరమైనవని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అభివర్ణించారు. ఈ సమయంలో వారికి రక్షణ అవసరమని పేర్కొన్నారు.
"డియర్ పీఎం, మీరు ఈరోజు చెప్పిన దానికి దేశానికి, మీడియాకు లభించింది కేవలం హెడ్లైన్ మాత్రమే. లక్షలాది మంది వలస కార్మికుల కష్టాలను పరిష్కరించడంలో విఫలమైనందుకు దేశం తీవ్ర నిరాశకు గురైంది." -రణదీప్ సుర్జేవాలా
హెడ్లైన్కే పరిమితం
కాంగ్రెస్ నాయకులు మనీశ్ తివారీ, అభిషేక్ సింఘ్వీ సైతం మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ ప్రకటన కేవలం హెడ్లైన్ మాత్రమేనని.. ప్యాకేజీకి సంబంధించి మరిన్ని వివరాలేమీ లేవని వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మాత్రం ఆర్థిక ప్యాకేజీని స్వాగతించారు.
ప్యాకేజీ భేష్
భాజపా పాలిత రాష్ట్రాలకు చెందిన కొందరు ముఖ్యమంత్రులు మోదీ ప్రకటించిన ప్యాకేజీపై ప్రశంసలు కురిపించారు. యువత, రైతులతో పాటు అన్ని వర్గాల వారికీ ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ప్యాకేజీ ద్వారా భారత్ స్వావలంబన సాధిస్తుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అభిప్రాయపడ్డారు.