దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతోంది. భారత పర్యటనకు వచ్చిన 16 మంది ఇటలీ పౌరులకు, వారితో ఉన్న డ్రైవర్‌కు ఇప్పటికే వైరస్ నిర్ధరణ కాగా.. వారితో మమేకమైన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దిల్లీలో ఒకరు, ఆగ్రాకు చెందిన ఆయన బంధువులు ఆరుగురు, తెలంగాణాలో ఒకరికి కరోనా సోకినట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ తెలిపారు. ఇటీవలే ఇటలీ నుంచి వచ్చిన పేటీఎంకు చెందిన గురుగ్రామ్ ఉద్యోగికి వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు ఇంటి నుంచే పనిచేయాలని పేటీఎం సంస్థ తమ ఉద్యోగులను కోరింది.
అదనపు ల్యాబ్‌ల ఏర్పాటుకు సిద్ధం
రాజస్థాన్‌లో పర్యటించిన ఇటలీ వాసులకు కరోనా నిర్ధరణ కాగా వారు 215 మందితో కలిసి తిరిగినట్లు రాజస్థాన్ ఆరోగ్య మంత్రి రఘు శర్మ చెప్పారు. వారిలో 93 మంది నుంచి నమూనాలను తీసుకుని పంపించగా 51 మందికి కరోనా లేదని తేలింది. 41 మందికి ఫలితాలు రావాల్సి ఉన్నట్లు వైద్య అధికారులు చెప్పారు. దిల్లీలో కరోనా సోకిన వ్యక్తి కలిసిన 88 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లిడించారు. ఈ మేరకు 19 ప్రభుత్వ, ఆరు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. అవసరమైతే.. దిల్లీలోని లేడీ హర్డింగే ఆసుపత్రి, ఎల్ఎన్జేపీ ఆసుపత్రుల్లో కరోనా నిర్ధరణ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ చెప్పారు.
హోలీకి ప్రముఖులు దూరం
వైరస్ వ్యాప్తికి అవకాశం ఇవ్వకుండా హోలీకి దూరంగా ఉండనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ కూడా హోలీ సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేయాలని కేంద్ర మంత్రి హర్షవర్దన్ ఆదేశించారు.
సరిహద్దు, చెక్ పోస్ట్‌ల వద్ద స్క్రీనింగ్ ఏర్పాట్లు
భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతాలైన.. పెత్రపోల్, అగర్తల చెక్‌పోస్ట్‌ల వద్ద కూడా స్క్రీనింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అట్టారీ సరిహద్దులు, డేరాబాబా నానక్ చెక్‌పోస్ట్ వద్ద కూడా పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అన్ని నౌకాశ్రయాల్లో నిరంతరం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ నిర్ధరణ అయిన వారి ఇళ్లకు మూడుకిలోమీటర్ల పరిధిలో పూర్తిస్థాయిలో పరిశుభ్రత చర్యలు చేపట్టినట్లు..కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.
వైరస్ నివారణపై ప్రధాని చర్చలు
దేశంలోని 21 విమానాశ్రయాల్లో ఇప్పటి వరకూ 6 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. నేపాల్, భూటాన్, మయన్మార్ సరిహద్దుల వెంబడి భారత్‌లో ప్రవేశించిన 10లక్షల మందికి కూడా పరీక్షలు చేసినట్లు వివరించారు. పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ మాత్రమే కరోనా వైరస్ నిర్ధరణ చేయగలదన్న ప్రకాష్ జావడేకర్.. మరో 15 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరో 19 అదనపు కేంద్రాలు ఏర్పాటు ప్రక్రియ జరుగుతోందని ఆయన వివరించారు. ప్రధాని రోజూ కరోనా వైరస్ నివారణ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
కమిటీ ఏర్పాటు
దేశ రాజధానిలోని అనేక విద్యాసంస్థలు తమ పరిసరాలను పరిశుభ్ర పరుస్తున్నాయి.
వివిధ కార్యక్రమాలు, ప్రదర్శనలను రద్దు చేసుకున్నాయి. కరోనా నియంత్రణకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం18మందితో కమిటీ నియమించింది. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయి.