దేశంలో ఓవైపు కరోనా మహమ్మారి ఉద్ధృతి పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటు (కోలుకుంటున్నవారి శాతం) పెరుగుతుండటం, మరణాల రేటు తగ్గుతుండటం కొంత ఊరటనిస్తోంది. తొలిసారిగా రికవరీ రేటు 50శాతం దాటింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కొవిడ్ బారిన పడిన వారిలో ఇంతవరకు 50.59% మంది కోలుకున్నారు. వైరస్‌తో బాధపడుతున్న వారికంటే కోలుకున్న వారి సంఖ్య 13,031 అధికంగా ఉంది.
మరణాల రేటు తగ్గుదల..
రెండు నెలల క్రితం నాటితో పోలిస్తే ఇప్పటికి మరణాల రేటు తగ్గింది. ఏప్రిల్ 14 నాటికి మరణాల రేటు 3.26% కాగా.. గత నెల అదే తేదీ నాటికీ సుమారు అంత శాతమే ఉంది. ఈనెల 14 నాటికి అది 2.86 శాతానికి తగ్గింది.
కొంత సాంత్వన..
రికవరీ రేటు పెరిగి.. మరణాల రేటు తగ్గడం కొంత ఉపశమనం కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సందర్భాల్లో ఆర్థిక కార్యకలాపాలు క్రమేపీ పెంచుకుంటూ వెళ్లడానికి వీలు కలిగింది. ఏప్రిల్ 19 నుంచి మే 29 వరకు క్రియాశీల(యాక్టివ్) కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య తక్కువగానే ఉండేది. క్రమేపీ ఈ వ్యత్యాసం తగ్గుతూ వచ్చింది. తొలిసారి ఈనెల 10న యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య పెరిగింది. తాజాగా అది 50 శాతం దాటింది.
దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో గుజరాత్‌లో రికవరీ రేటు మెరుగ్గా ఉంది. తమిళనాడు తర్వాతి స్థానంలో ఉంది. మహారాష్ట్ర, దిల్లీల్లో మాత్రం జాతీయ సగటు కంటే తక్కువగానే ఉంది.
మూడో రోజూ 10 వేలకు పైగా కేసులు
దేశంలో కొవిడ్ వ్యాప్తి తీవ్రత పెరుగుతూనే ఉంది. వరుసగా 3వ రోజు(ఆదివారం) 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కొత్తగా 11,929 కేసులు బయటపడ్డాయి. వరుసగా 4వ రోజు 300కి పైగా కొవిడ్ మరణాలు సంభవించాయి. ఒక్క రోజులో 311 మంది చనిపోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 113 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలో 57, గుజరాత్‌లో 33 మరణాలు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: దిల్లీలో కరోనా పరిస్థితిపై సోమవారం అఖిలపక్ష భేటీ