దిల్లీ ఎన్నికలు కాంగ్రెస్‌కు మరోసారి ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. క్రితం సారి ఖాతా తెరవని హస్తం పార్టీ.. ఈ ఎన్నికల్లోనూ ఒక్క స్థానం కూడా గెల్చుకోలేకపోయింది. తాజా ఫలితాలు.. 1998 నుంచి 2013 వరకు హస్తినను ఏకధాటిగా పాలించింది ఈ కాంగ్రెస్ పార్టీయేనా? అని కార్యకర్తలు ముక్కున వేలేసుకునేలా చేశాయి.
ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసినట్లుగానే కాంగ్రెస్ పరాజయం పాలైంది. తొలుత ఎగ్జిట్‌పోల్స్‌పై విరుచుకుపడిన ఆ పార్టీ ఇప్పుడు ఫలితాలను చూసి మౌనంగా ఉండిపోయింది.
2015 శాసనసభ ఎన్నికల్లో 3 స్థానాలే గెల్చుకున్న భాజపా ఈసారి తన సంఖ్యను ఎనిమిదికి పెంచుకుంది. అదే చోట కాంగ్రెస్ చతికిలపడటం పార్టీ సీనియర్లను అంతర్మథనంలో పడేసింది.
బలమైన నాయకులేరీ..?
దిల్లీలో 15 సంవత్సరాలు కాంగ్రెస్ తరఫున సీఎంగా కొనసాగిన దివంగత షీలాదీక్షిత్ వంటి నాయకులు స్థానికంగా ఇప్పుడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దిల్లీలో ఆమ్ ఆద్మీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి మూడో స్థానానికే పరిమితమవుతూ వస్తోంది హస్తం పార్టీ.
మరింత కిందకు...
2013లో దాదాపు 24శాతం ఓటు షేర్ ఉన్న కాంగ్రెస్ 2015 వచ్చేసరికి 9.7 శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఫలితాలను విశ్లేషిస్తే మాత్రం ఈ సారి మరింత దిగజారే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రచారమెక్కడ..?
ఫలితాలను చూసి ఏం లాభం.. అసలు ప్రచార దశలోనే కాంగ్రెస్ ఓడిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. భాజపా, ఆప్ చేసినంతగా కాంగ్రెస్ ప్రచారంపై ఆసక్తి చూపించలేదు. ప్రముఖ నాయకులెవరూ షీలాదీక్షిత్ సమయంలో చేసిన అభివృద్ధిని ప్రచారం చేయలేకపోయారు. కస్తూర్బానగర్, గాంధీ నగర్, శీలంపుర్, ముస్తఫాబాద్, బద్లీ, సుల్తాన్పూర్ మజ్రా, చాందినీ చౌక్ నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ విస్తృత స్థాయిలో ప్రచారం చేయగలిగింది.
అగ్రనేతలు ఎవరూ పెద్దగా ప్రచారంలో చురుగ్గా వ్యవహరించకపోవటం హస్తం పార్టీకి సమస్యగా మారింది. చాలా మంది అభ్యర్థులే ఆ ప్రచార బాధ్యత తీసుకుని ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు హడావుడి చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించటంలో విఫలమయ్యారు. ప్రచార చివరిదశలో మాత్రమే రాహుల్, ప్రియాంక గాంధీ, మన్మోహన్ సింగ్ వచ్చినా అది ఏమాత్రం ఫలితాన్నివ్వలేదు.
ఆత్మ పరిశీలన ఎందుకు.. చర్యలే..
ఎన్నికల ఫలితాల అనంతరం... పార్టీ నేతలు ఒక్కొక్కరూ ఒక్కో మాట మాట్లాడుతున్నారు. అత్మ పరిశీలన బదులు.. చర్యలకు ఉపక్రమించాలని కోరుతున్నారు.
'' మేం మరోసారి దిల్లీలో ఓడిపోయాం. ఆత్మ పరిశీలన చాలు... ఇక చర్యలకు ఉపక్రమించాల్సిందే. ఆత్మపరిశీలనతో మరింత ఆలస్యమవుతుంది. ఓటమికి నేను కూడా బాధ్యత వహిస్తున్నాను.''
- దిల్లీ మహిళా కాంగ్రెస్ చీఫ్ షర్మిష్ఠ ముఖర్జీ
భాజపా విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ఏదో ఒక దానిలో భాగంగా ఓటర్లు మరోసారి ఆప్‌వైపే మొగ్గుచూపారన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా.
ఇదీ చూడండి: ఆప్ విజయం- భాజపా పరాజయం.. కారణాలివే...