మే 16న దిల్లీలోని సుఖ్‌దేవ్ విహార్ ఫ్లైఓవర్ ప్రాంతంలో వలస కార్మికులను రాహుల్ గాంధీ కలవడానికి సంబంధించి శనివారం (మే23న) డాక్యుమెంటరీ విడుదల చేసింది కాంగ్రెస్. సుమారు 16 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో రాహుల్ గాంధీ.. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలపై తీవ్ర ప్రభావం పడిందని, అది వలస కార్మికులకు తీరని నష్టం చేకూర్చిందన్నారు. వందల కిలోమీటర్లు నడుస్తూ స్వస్థలాలకు చేరుకుంటున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సాయం కింద దేశంలోని 13 కోట్ల నిరుపేద కుటుంబాలకు నెలకు రూ. 7,500 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు రాహుల్.
హరియాణా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ గ్రామానికి వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నట్లు వలస కార్మికుల బృందం రాహుల్‌కు తెలిపింది. మహేశ్ కుమార్ అనే వ్యక్తి.. రైలు రిజర్వేషన్ ఛార్జీల కింద రూ. 3,000 ఇస్తామని చెప్పినప్పటికీ తమకు కేంద్రం నుంచి ఎలాంటి నగదు సాయం అందలేదని తెలిపారు. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సాయం చేయాలని రాహుల్ గాంధీని వేడుకున్నారు. లాక్డౌన్ తర్వాత తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత వారిని స్వస్థలాలకు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేశారు రాహుల్. రేషన్ కూడా అందించారు.
" వలస కార్మిక సోదర, సోదరీమణులారా మీరే ఈ దేశానికి బలం. దేశంపై పడే మొత్తం భారాన్ని మీ భుజాలపై మోస్తున్నారు. దేశం మొత్తం మీకు న్యాయం చేయాలనుకుంటోంది. దేశాన్ని బలోపేతం చేయటం ప్రతిఒక్కరి బాధ్యత."
– రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత