తూర్పు లద్దాఖ్ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమీక్ష నిర్వహించింది. సరిహద్దుల్లో చైనా బెదిరింపు చర్యలకు దిగుతున్న వేళ భారత్ కార్యాచరణ సంసిద్ధతపైనా చర్చించినట్లు తెలుస్తోంది. లద్దాఖ్‌తో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం సహా వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీని మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన 'చైనా అధ్యయన బృందం' సమావేశం 90 నిమిషాల పాటు సాగింది. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.
అన్ని అంశాలపై..
భారత్, చైనా దళాల మధ్య పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో తాజాగా జరిగిన ఘర్షణలపై సైనికాధిపతి ఎంఎం నరవణె సమావేశంలో వివరించారు. ప్రస్తుత పరిస్థితులపై అన్ని రకాల అంశాలను సమీక్ష నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
సైనిక చర్చలు..
శీతకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయిన సమయంలో సైనికులు, ఆయుధాల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లపైనా ఈ భేటీలో చర్చించారు. అంతేకాకుండా మున్ముందు జరగబోయే సైనిక చర్చల విషయమూ ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో భారత వైఖరి ఎలా ఉండాలన్న విషయంపై సమాలోచనలు చేసినట్లు సమాచారం.
ఇదీ చూడండి: 18 విమానాలతో చైనా విన్యాసాలు.. అమెరికాకు హెచ్చరిక?