లాక్డౌన్-3 మరో వారంలో పూర్తవుతున్న నేపథ్యంలో విమాన సర్వీసుల పునఃప్రారంభంపై కసరత్తు ముమ్మరం చేసింది పౌరవిమానయాన శాఖ. విమానాలు నడపడంపై రెండ్రోజుల్లో స్పష్టమైన నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం. గత 3 రోజులుగా విమాన సంస్థలు, విమానాశ్రయ ఆపరేటర్లతో చర్చలు జరిపిన పౌరవిమానయానశాఖ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి.... ఇవాళ విమాన సంస్థలతో మరోసారి సమాలోచనలు జరుపుతున్నారు.
మే 17 కంటే ముందే?
విమాన సర్వీసులు ఎక్కడి నుంచి ఎక్కడికి నడపవచ్చో పరిశీలిస్తున్నారు అధికారులు. టికెట్ బుకింగ్ ప్రారంభించడం, సంస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా నిబంధనలు రూపొందిస్తున్నారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, ఆరోగ్యసేతు యాప్ వినియోగం తప్పనిసరి చేయనున్నారు.
ఈనెల 17 కంటే ముందే సర్వీసులు ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇవాళ లేదా రేపు సాయంత్రంలోగా అధికారులు తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
రెడ్జోన్లే సమస్య!
దాదాపు అన్ని ప్రధాన నగరాలు రెడ్‌జోన్‌లో ఉండటం వల్ల ఎలా సర్వీసులు నడపాలనేది చర్చిస్తున్నారు అధికారులు. విదేశాల నుంచి వచ్చినవారు, క్వారంటైన్ నుంచి వచ్చినవారి విషయంలో ఎలా వ్యవహరించాలో సమాలోచనలు చేస్తున్నారు.
మంగళవారం నుంచి 15 ముఖ్య నగరాలకు 15 సర్వీసులు నడపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది రైల్వేశాఖ.