గల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు వెనక్కి తగ్గాయి. తమకు చెందిన వాహనాలు, గుడారాలను 1 నుంచి 2 కిలోమీటర్ల మేర వెనక్కి తరలించింది చైనా. అయితే గల్వాన్ నదీ లోయలో ఇప్పటికీ చైనాకు చెందిన భారీ సాయుధ వాహనాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత సైన్యం ప్రకటించింది.
సరిహద్దు ఘర్షణ అనంతరం ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు చైనా బలగాలను ఉపసంహరిస్తోందని తెలుస్తోంది.
పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద..
పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద చైనా సైన్యం గుడారాలు, నిర్మాణాలు తొలగిస్తూ కనిపించిందని వెల్లడించింది భారత సైన్యం. గోగ్రా హాట్ స్ప్రింగ్ ప్రాంతంలోనూ ఉపసంహరణలు చేసిందని చెప్పింది.
ఇదీ జరిగింది..
మే 4న తూర్పు లద్దాఖ్‌లో చైనా బలగాల మోహరింపుతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సైనిక ఉపసంహరణకు తొలి దఫాలో జూన్ 6న ఇరుదేశాల సైనిక కమాండర్ల స్థాయిలో సంప్రదింపులు జరిగాయి. అయితే జూన్ 15, 16 తేదీల్లో జరిగిన ఘర్షణల్లో భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు అమరులు కావడం, చైనా సైనికుల్లో పలువురు మృతి చెందడం వల్ల చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.
అయితే ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల అంగీకారం మేరకు జూన్ 22న రెండో దఫా చర్చలు జరిగాయి. ఈ సమావేశం వేదికగానే సైనిక ఉపసంహరణకు ఇరువర్గాల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. జులై 1న మూడో దఫాలో 12 గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశంలో అంతిమ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.